Begin typing your search above and press return to search.

ఏపీ లోకల్ ఎన్నికల్లో ఈ పార్టీలకే గుర్తులు ఇస్తారట

By:  Tupaki Desk   |   9 March 2020 4:53 AM GMT
ఏపీ లోకల్ ఎన్నికల్లో ఈ పార్టీలకే గుర్తులు ఇస్తారట
X
ఏపీలో స్థానిక ఎన్నికల నగరా మోగటం తెలిసిందే. కారణాలు ఏమైనా కానీ.. వరుస పెట్టి స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటివేళ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆసక్తికర అంశం మీద నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో ఎన్ని పార్టీలు ఉన్నా.. 19 పార్టీలకు మాత్రమే గుర్తులు కేటాయించనున్న విషయాన్ని స్పష్టం చేసింది.

గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జాతీయ.. రాష్ట్ర స్థాయి అన్న రెండు డివిజన్లు చేశారు. జాతీయ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో బీజేపీ.. కాంగ్రెస్.. బీఎస్పీ.. సీపీఐ.. సీపీఎం.. ఎన్సీపీలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఇక.. ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలను కూడా గుర్తించారు. మరి.. ఏపీలోని పార్టీలన్నంతనే గుర్తుకు వచ్చే జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారికి ప్రత్యేక గుర్తును ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఈ జాబితాలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్.. తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకే.. ఫార్వర్డ్ బ్లాక్.. ఎంఐఎం.. ఐయూఎంఎల్.. జనతాదళ్ (ఎస్).. జనతాదళ్ (యూ).. సమాజ్ వాదీ.. ఆర్ఎల్ డీ.. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఉన్నాయి. వీటి తరపున పోటీ చేసే వారికి.. ఆయా పార్టీలకు చెందిన గుర్తుల్ని కేటాయించనున్నారు. ఎన్నికల కమిషన్ వద్ద మరో 89 పార్టీలు రిజిష్టర్ చేసుకున్నా.. వారికి మాత్రం ఎలాంటి గుర్తులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడే సంగతి తెలిసిందే. ఏ పార్టీకి ఓటు వేయకూడదని భావించే వారి కోసం ‘నోటా’ ఆప్షన్ ఉంటుందన్న విషయం తెలిసిందే.