Begin typing your search above and press return to search.

యాడ్ రెవెన్యూ వదులుకొని మరీ ఎంట్రీ చూపించారు?

By:  Tupaki Desk   |   11 May 2023 10:11 AM GMT
యాడ్ రెవెన్యూ వదులుకొని మరీ ఎంట్రీ చూపించారు?
X
ఒక బ్యాట్ మెన్ అవుట్ అయ్యాడు.. అతడు పెవిలియన్ కు వెళ్లిపోతున్నాడు.. కొత్త బ్యాట్స్ మెన్ ఎంట్రీ ఇస్తున్నాడు అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఔట్ అయినంతనే.. ఎలా ఔట్ అయ్యారన్నది చూపించి.. పెవిలియన్ బాట పడుతున్న సన్నివేశాన్ని చూపిస్తూ.. ఆ వెంటనే వాణిజ్య ప్రకటనల (యాడ్స్)లోకి వెళ్లటం సర్వసాధారణంగా జరిగేది. ఎవరైనా అవుట్ కావటం.. ఓవర్ పూర్తి కావటం లాంటి సందర్భాల్లో కోట్లాదిరూపాయిలు కాసులు కురిపించేలా యాడ్స్ ను ప్రదర్శిస్తారు.

అలాంటి కోట్ల రూపాయిల ప్రకటనల ఆదాయాన్ని వదిలేసి మరీ.. ఒక బ్యాట్స్ మెన్ క్రీజ్ లోకి ఎంట్రీ అయ్యే సీన్లను చూపించటం సాధ్యమా? అంటే కాదనే అంటారు. కానీ.. మహేంద్ర సింగ్ ధోని విషయంలో మాత్రం సాధ్యమనే విషయాన్ని చెప్పాలి. ఐపీఎల్ సీజన్ లో అతగాడికి ఉన్న క్రేజ్ చూస్తే.. వావ్ అనకుండా ఉండలేని పరిస్థితి.

కేవలం ధోనిని చూడటం కోసం స్టేడియంకు పోటెత్తుతున్నారుప్రేక్షకులు. మహీ ఒక్క బంతి ఆడినా.. ప్రత్యక్షంగా ఆ సన్నివేశాన్ని చూసేందుకు వస్తున్న వైనం తాజాగా చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను చూసినప్పుడు అర్థమవుతుంది.

అంతేకాదు.. ఈసారి అతను ఎంట్రీ ఇస్తున్న వేళలో.. స్టేడియం మొత్తం ధోని అరుపులతో దద్దరిల్లింది. అంతేనా.. ఎప్పుడూ జరగనిది మరొకటి జరిగింది. ధోనికి ఉన్న క్రేజ్ కారణంగా స్టార్ స్పోర్ట్స్ యాడ్స్ వేయకుండా ధోని ఎంట్రీని అలా చూపించేసింది.

ధోనిని చూపించటం కోసం.. కోట్లాది రూపాయిల యాడ్స్ ను వదులుకోవటం ఆసక్తికరంగా మారింది. ధోని బ్యాటింగ్చేస్తున్న వేళలో.. జియోసినిమా యాప్ లోవీక్షకుల సంఖ్య 1.8 కోట్ల రికార్డు స్థాయిని టచ్ చేసింది. గతంలో ఇది 1.7 కోట్లు. తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

కోట్లాది మంది అభిమానుల అభిమానానికి తగ్గట్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చివర్లో వచ్చిన ధోని.. మెరుపులు మెరిపించాడు. తొమ్మిది బంతుల్లో రెండు సిక్సర్లు.. ఒక ఫోర్ తో మొత్తం ఇరవై పరుగులు ధనాధన్ అని చేసేసి.. మరోసారి మెరిశాడు. మరోసారి తనకు మించిన ఫినిషర్ లేరన్న విషయాన్ని ఫ్రూవ్ చేశారు. ధోనినా మజాకానా?