Begin typing your search above and press return to search.

మహిళా క్రికెటర్‌ ను పెళ్లాడబోతున్న స్టార్‌ క్రికెటర్‌!

By:  Tupaki Desk   |   1 Jun 2023 4:12 PM GMT
మహిళా క్రికెటర్‌ ను పెళ్లాడబోతున్న స్టార్‌ క్రికెటర్‌!
X
సినిమా రంగానికి, క్రికెట్‌ కు అవినాభావ సంబంధం ఎక్కువే. ఇప్పటికే పలువురు సినీ తారలు క్రికెటర్లను పెళ్లాడారు. గతంలో షర్మిలా టాగూర్‌.. నాటి ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీని పెళ్లాడింది. ఇక బాలీవుడ్‌ హార్ట్‌ త్రోబ్‌ అనుష్క శర్మ.. భారత బ్యాటింగ్‌ సంచలనం విరాట్‌ కోహ్లీతో ఏడడుగులు నడిచింది. ఇక ఇటీవల మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ అతియా శెట్టి.. భారత స్టార్‌ బ్యాట్సమెన్‌ కేఎల్‌ రాహుల్‌ ను పెళ్లి చేసుకుంది.

ఇప్పుడు ఈ కోవలో క్రికెటర్లు తమ రంగానికే చెందిన క్రికెటర్లను పెళ్లి చేసుకుంటున్నారు. మహిళా క్రికెట్‌ కు ఆదరణ పెరుగుతుండటం, అందంతోనూ, తమ ఆటతోనూ వారు అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి క్రికెటర్‌ కావడం విశేషం. జూన్‌ 3న అతడి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది.


కాగా ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు రుతురాజ్‌ గ్వైకాడ్‌ ఆడాడు. ఓపెనర్‌ గా చెన్నై విజయాల్లో మరో ఓపెనర్‌ కాన్వేతో కలిసి మంచి పునాది వేశాడు. ఐపీఎల్‌–2023లో రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. ప్రస్తుతం ఇంగ్లండ్‌ లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023కి స్టాండ్‌ బై ప్లేయర్‌గా రుతురాజ్‌ గ్వైకాడ్‌ ఎంపికయ్యాడు.

అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ నుంచి తాను తప్పుకోనున్నట్లు రుతురాజ్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)కి తెలిపినట్లు సమాచారం. ముందు తన వివాహం కారణంగా లండన్‌ కు ఆలస్యంగా వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రిస్క్‌ తీసుకోలేమని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. దీంతో రుతురాజ్‌ పూర్తిగా టెస్టు చాంపియన్‌ షిప్‌ నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్‌ స్థానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

కాగా రుతురాజ్‌ పెళ్లి వార్తల నేపథ్యంలో పెళ్లి కుమార్తె ఎవరా అని తెలుసుకోవడానికి క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీఎల్‌ ట్రోఫీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుచుకున్నాక క్రికెటర్లతోపాటు వారి భార్యలు కూడా ట్రోఫీలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆ సమయంలో రుతురాజ్‌ పక్కన ఉన్న అమ్మాయి మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతో ఆ అమ్మాయి ఎవరని ఆరా తీసినవారికి రుతురాజ్‌ కాబోయే భార్య అని తెలిసింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ పెళ్లి చేసుకునే అమ్మాయి.. పేరు ఉత్కర్ష పవార్‌. అతడి మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్‌ అని తెలుస్తోంది. 1998, అక్టోబరు 13న ఆమె జన్మించింది. ఆమె.. పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సైన్సెస్‌ స్టూడెంట్‌ అని సమాచారం.

దేశవాళీ క్రికెట్‌ లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్కర్ష పవార్‌ ఆల్‌ రౌండర్‌. ఇటీవల వుమెన్‌ సీనియర్‌ వన్డే ట్రోఫీలోనూ ఆడింది. గత కొంతకాలంగా రుతురాజ్‌ దేశవాళీ క్రికెట్‌ లో ముంబైకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో ఆమెతో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. రుతురాజ్‌ పెళ్లి వార్త తెలియడంతో అతడి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.