Begin typing your search above and press return to search.

స్టార్ క్యాంపెయిన‌ర్లు అంటే కాంగ్రెస్ భాష‌లో అర్థం వేరే!

By:  Tupaki Desk   |   1 Dec 2018 5:13 AM GMT
స్టార్ క్యాంపెయిన‌ర్లు అంటే కాంగ్రెస్ భాష‌లో అర్థం వేరే!
X
స్టార్ క్యాంపెయినర్లు... ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌హ‌జంగా వినిపించే పేరు. ఆయా పార్ట‌ల్లోని బ‌ల‌మైన నేత‌ల‌కు ఈ హోదా ద‌క్కుతుంది. స్టార్ క్యాంపెయిన‌ర్ హోదా ఉన్న వారు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించాలి. కానీ, కాంగ్రెస్ నేతల ప‌రిభాష‌లో దీని అర్థం మారిపోతోంది. స్టార్ క్యాంపెయిన‌ర్ అంటే త‌మ నియోజ‌క‌వ‌ర్గం దాట‌ని సీనియ‌ర్ నేత‌లే అనే భావ‌న తాజా ప‌రిణామాల‌ను చూస్తే క‌లుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్‌లోని ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగ‌తా వారెక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం.

తెలంగాణ‌ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా - ముఖ్య‌నేత‌ల వివ‌రాల‌తో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ కు అందజేసింది. అయితే, వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ప్రచారక్షేత్రంలో ఎక్కడా కన్పించడం లేదు. సొంత నియోజకవర్గంలోనే డక్కీమొక్కీలు పడుతున్న స్టార్ క్యాంపెయినర్లు గడపదాటి బయటికొస్తలేర‌నే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. తమ నియోజకవర్గాల్లోనే అగ్రనేతల ప్రచారసభలు పెట్టించుకొనేందుకు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ దిగ్గజాలు అనుకున్నవారి రాతలే తలకిందులు కానున్నాయంటూ పలు సర్వేలు చెప్తుండటంతో స్టార్ క్యాంపెయినింగ్ దేవుడెరుగు.. ముందు ఇల్లు చక్కబెట్టుకుందామంటూ వారు నియోజకవర్గానికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియ‌ర్లు - స్టార్ క్యాంపెయిన‌ర్లు అయిన జానారెడ్డి - రాజనర్సింహ - డీకే అరుణ - షబ్బీర్ అలీ తదితరులంతా కనీసం పక్క నియోజకవర్గం వైపు కూడా తొంగిచూడడం లేదు. ఇక ఢిల్లీ నుంచి వస్తున్న జాతీయనేతలు చోటామోటా నాయకులను పక్కన పెట్టుకొని గాంధీభవన్‌ లో ప్రెస్‌ మీట్లకు పరిమితమవుతున్నారు. మరోవైపు హెలికాప్టర్‌ లో చక్కర్లు కొడుతూ.. వంద నియోజకవర్గాలు తిరుగుతానన్న రేవంత్‌ రెడ్డి.. తిరుగుతున్న మాట నిజ‌మే గాని కొడంగల్‌ లోనే పరిస్థితి తలకిందులయ్యేలా ఉందంటూ అధిష్ఠానం చావుకబురు చల్లగా చెప్పడంతో ఆయన నియోజకవర్గంలో తిష్ట‌వేశారిపుడు. రేవంత్ ప్రచారానికి కావాల్సిన హెలికాప్టర్‌ ను ఏఐసీసీ ఏర్పాటు చేసినప్ప‌టికీ ఆయ‌న భ‌ద్ర‌తా కార‌ణాల‌ను పేర్కొంటూ త‌న టూర్‌ ను ఆపివేసుకున్నారు.