Begin typing your search above and press return to search.

సీన్ రివర్స్.. పోస్టు పెట్టిన మహిళను తిట్టి.. వెయిటర్ కు భారీ టిప్

By:  Tupaki Desk   |   28 Jun 2020 4:10 AM GMT
సీన్ రివర్స్.. పోస్టు పెట్టిన మహిళను తిట్టి.. వెయిటర్ కు భారీ టిప్
X
సోషల్ మీడియాలో కొన్ని పోస్టులకు ఊహించని రీతిలో రియాక్షన్లు వెల్లువెత్తుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. మాస్కు ధరించకుండా స్టార్ బక్స్ కు వెళ్లిందో మహిళ (లిన్ గిల్లెస్). ఆమె ఆర్డర్ ఇచ్చిన వస్తువుల్ని సర్వ్ చేయటానికి అక్కడి వెయిటర్ ఒప్పుకోలేదు. ముఖానికి మాస్కు లేని వారి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోకూడదన్న మాట వెయిటర్ నోట వచ్చింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ.. తనకు ఘోరమైన అవమానం జరిగిందంటూ సదరు వెయిటర్ మీదా.. స్టార్ బక్స్ మీదా చిందులు తొక్కింది. సోషల్ మీడియాలో తన అనుభవాన్ని ఆమె పోస్టు రూపంలో పెట్టారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఉదంతంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థతుల్లో మాస్కు పెట్టుకోకుండా రెస్టారెంట్ కు వెళతావా? అంటూ తిట్టిపోయటం షురూ చేశారు.

అదే సమయంలో లిన్ గిల్లెస్ చేసిన తప్పునకు ఆమెకు ఫుడ్ సప్లై చేయని వెయిటర్ గుటిరెజ్ ను పలువురు అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం పొగడ్తలతో సరి పెట్టకుండా.. సదరు వెయిటర్ కు చేసిన దానికి టిప్ ఇవ్వాలని భావించాడు. తన ఆలోచనను సోషల్ మీడియాలో చెప్పటంతో.. అతడి చేతికి 32వేల డాలర్లు వచ్చాయి. ఈ భారీ మొత్తాన్ని సదరు వెయిటర్ కు అందజేశారు. ఊహించని రీతిలో వచ్చిన ఈ టిప్ కు సదరు వెయిటర్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.