పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో సామర్థ్యానికి మించి ఏడుగురు ప్రయాణికులను ఎక్కించి నిలబడి ప్రయాణం చేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఆ విమాన పైలట్ కు, మరో ఇద్దరు అధికారులకు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ షోకాజ్ నోటీసులు పంపించింది. కెప్టెన్ అన్వర్ ఆదిల్ - సీనియర్ ఎయిర్ హోస్టెస్ హీనా తురబ్ - టెర్మినల్ మేనేజర్ అక్బర్ అలీ షాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జనవరి 20న కరాచీ నుంచి మదీనా వెళ్లిన విమాన సామర్థ్యం జంప్ సీట్లతో కలిపి 409 కాగా సిబ్బంది 416 మందిని ఎక్కించారు. ఇలా ఏడుగురు ప్రయాణికులు నిలబడి ప్రయాణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రికలో వార్త రావడంతో ప్రపంచంలో మొట్టమొదటి సారి ఇలా ప్రయాణికులను విమానంలో తీసుకువెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పత్రిక కథనం ప్రకారం సంఘటనపై పైలట్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. నిబంధనల ప్రకారం విమానం తలుపులు మూసే ముందు పరిమితికి మించి ఎవరైనా ఉంటే చెప్పాల్సి ఉంటుందని కానీ అలా చేయలేదని పైలట్ అన్నారు. తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత చూస్తే కొంతమంది అదనంగా కనిపించారని, దీంతో ఏం చేయాలో తోచలేదన్నారు. వెనక్కి తీసుకెళ్లి కరాచీలో లాండ్ చేద్దామంటే అందుకు చాలా ఇంధనం వృథా అవుతుందని, అది తమ విమానయాన సంస్థ ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి అలాగే తీసుకెళ్లిపోయానని ఆ పైలట్ చెప్పినట్లు మీడియా సంస్థ వివరించింది. ప్రయాణికులను అలా తీసుకెళ్లడం భద్రతకు చాలా ప్రమాదమని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి డేన్ యల్ గిలానీ తెలిపారు. ఈ ప్రకటనకు తగినట్లుగానే నోటీసులు అందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/