Begin typing your search above and press return to search.

రాహుల్‌ కొమ్ములు ఉన్నాయనుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:05 AM GMT
రాహుల్‌ కొమ్ములు ఉన్నాయనుకుంటున్నారా?
X
రాహుల్‌ గాంధీ తాను మానవాతీత వ్యక్తినని భావిస్తూ ఉంటారా? అందరు మనుషులకూ వర్తించే నిబంధనలు తనకు మాత్రం వర్తించ రాదని, తాను అందరికంటె కాస్త అధికుణ్ని గనుక.. తనను దేశంలోని ఏ వ్యవస్థ అయినా ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుందని ఆయన భావిస్తూ ఉంటారా? ఏమోగానీ.. తాజా పరిణామాలు, ఆయన కోర్టును ఆశ్రయిస్తున్న పద్ధతులను గమనిస్తే.. అలాంటి అభిప్రాయమే కలుగుతోందని జనం అనుకుంటున్నారు. దేశంలో ఒక సాధారణ ఎంపీ మాత్రమే అయిన రాహుల్‌ గాంధీ.. తన మీద ఏ కోర్టు కేసు వచ్చినా సరే వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ ఆ పైకోర్టులను ఆశ్రయించే పద్ధతిని గమనిస్తే.. తన గురించి తనకు ఆయనలో చాలా అపోహలు ఉన్నట్లు అనిపిస్తోందని జనం అనుకుంటున్నారు. తాజాగా పరువు నష్టం కేసులో తనకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని కోరుతూ రాహుల్‌ గాంధీ తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రిగా గతంలో సేవలందించిన కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించినప్పటికీ.. సుప్రీం కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చడం.. ఆయనను అందరిలో ఒకడిగా ఉండమని ఆదేశించినట్లుగా ఉన్నదని జనం అనుకుంటున్నారు.

మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి రాహుల్‌ గాంధీ ఏదో తన నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసేశారు. హత్యచేసిన వ్యక్తి ఆరెస్సెస్‌ కు చెందిన వాడే అని అన్నారు. దీనికి సంబంధించి ఆయన మీద పరువునష్టం కేసు దాఖలైంది. మోదీ సర్కారును భ్రష్టు పట్టించడానికి, కనీసం వారి మీద బురద చల్లడానికి ఈ వ్యవహారం ఉపయోగపడుతుందనే భ్రమలు రాహుల్‌ లో ఉన్నాయో ఏమో గానీ.. ఇప్పటికీ నా వ్యాఖ్యల్లో ప్రతి పదానికి కట్టుబడి ఉన్నా.. అంటూ బీరాలు పలుకుతున్నారు.

అయితే భివాండీ న్యాయస్థానంలో ఆయన మీద పరువు నష్టం కేసు నడుస్తుండగా.. వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కావాలంటూ ఆయన సుప్రీంలో కేసు వేశారు. సుప్రీం దాన్ని తిరస్కరించింది. దీంతో రాహుల్‌ న్యాయవాది సిబల్‌ పిటిషన్‌ వెనక్కు తీసుకున్నారు. రాహుల్‌ విధిగా స్వయంగా హాజరై నిందితునిగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహాత్మాగాంధీని హత్య చేసిన వ్యక్తి.. ఆరెస్సెస్‌కు చెందిన వాడే అని ఆయన నిరూపించాల్సి ఉంటుంది.