Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ని అతిక్రమిస్తే నుదుటిపై స్టాంప్‌ లు!

By:  Tupaki Desk   |   27 March 2020 12:10 PM GMT
లాక్ డౌన్ ని అతిక్రమిస్తే నుదుటిపై స్టాంప్‌ లు!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఇక మనదేశంలో కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కి సరైన మందు లేకపోవడం తో , కరోనా భారిన పడకుండా ఉండాలంటే ..ఒకరికి ఒకరు దూరంగా ఉండటమే మన ముందుకున్న మార్గం. దీనితో దేశంలోని ప్రముఖుల నుండి సామాన్యుల వరకు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.

అయితే, కొందరు లాక్‌ డౌన్‌ ను సీరియస్‌గా తీసుకోకపోవడంపై పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో వారిని కట్టడి చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి.. అకారణంగా రోడ్లుపైకి వచ్చిన కొందరు వ్యక్తులపై జమ్ము కశ్మీర్‌ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న వారి చేతులు, నుదుటిపై తుడుచుకోవడానికి సాధ్యం కాని ఇంకుతో రణ్‌బీర్‌ సింగ్ పురా పోలీసుల స్టాంపు వేశారు.

దీనిపై కరోనా లాక్‌ డౌన్‌ అతిక్రమణదారు అనే పదాలతో పాటు... సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పేరు కూడా ఉంటుంది. ఈ స్టాంపు కనీసం 15 రోజులు నిలిచి ఉంటుందని పోలీసులు వివరించారు. వారు మళ్లీ ఈ తప్పు చేయకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా కాకుండా వారు మళ్లీ రోడ్డుపైకి వస్తే గుర్తించటం కూడా సులభమవుతుందని వివరించారు. ఇప్పటికే క్యారంటైన్‌లో ఉంటున్నవారిని గుర్తించే విధంగా ఇలాంటి స్టాంప్‌లను వేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో గురువారం నాటికి 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో పోలీసులు ఆకతాయిల ఆట కట్టించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.