డబ్బులు దండుకోవటానికి అదీ.. ఇదీ అన్న తేడా ఉండదేమో. తాజా ఉదంతం చూస్తే ఇది నిజం అనిపించక మానదు. ఖైరతాబాద్ గణేషుడి చేతిలో ఉంచిన భారీ లడ్డూ ప్రసాదాన్ని ఈ ఉదయం నుంచి భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టటం తెలిసిందే.
ఈ సందర్భంగా సదరు ప్రసాదాన్ని తీసుకోవటానికి హైదరాబాద్ తో పాటు.. పలు జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.నిర్వాహకుల పుణ్యమా అని.. వేలాది మంది భక్తుల్ని కంట్రోల్ చేసే విషయంలో చేతకాక.. చేతులు ఎత్తేయటం.. అనంతరం రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ తో భారీగా భక్తులు గాయపడ్డారు.
పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో భక్తజనం మండిపడుతుంటే.. మరోవైపు లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిలిపివేశారు. అదే సమయంలో.. లడ్డూను పంపిన తాపేశ్వరం వారికి లారీలో కొంత ప్రసాదం లడ్డూను పంపారు. ఇదే అదునుగా భావించిన కొందరు.. హయత్ నగర్ వద్ద లారీని ఆపి.. లడ్డూను అమ్ముకోవటం మొదలు పెట్టారు. ఈ హడావుడి గురించి తెలిసిన మీడియా వాకబుతో తోక ముడిచారు. భక్తులకు పంచాల్సిన ప్రసాదం విషయంలోనూ మరీ అంత కక్కుర్తా..?