Begin typing your search above and press return to search.

కాకినాడ సభలో ప్రమాదం.. ఒకరి మృతి!

By:  Tupaki Desk   |   9 Sep 2016 1:38 PM GMT
కాకినాడ సభలో ప్రమాదం.. ఒకరి మృతి!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన పవన్ కల్యాణ్ "సీమాంధ్ర ఆత్మగౌరవ సభ"లో ప్రమాదం చోటుచేసుకుంది. తమ అభిమాన నటుడిని, నాయకుడిని దగ్గర నుంచి చూడాలనే తపనతో భవనంపైకి ఎక్కాడు ఒక యువకుడు. అయితే ఈ క్రమంలో ఆ బిల్డింగ్ పై నుంచి పడి కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణ మృతి చెందారు. భవనంపై నుంచి తలకిందులుగా పడటంతో.. తలకు బలమైన గాయం తగిలింది.. దీంతో హుటాహుటిన అంబులెన్స్ లు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. కూడా ఫలితం లేకపోయింది.

ఇదే సమయంలో స్థానికంగా ఉన్న చెట్ల మీదకు ఎక్కినవారిలో ఇద్దరు అభిమానులు కింద పడ్డారు. దాంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన ఈ ఇద్దరిలో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. కాకినాడలో సీమాంధ్ర ఆత్మ గౌరవ సభకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు హాజరయ్యారు. సభ ఏర్పాటుచేసిన మైదానంలోనూ, మైదానానికి ఆనుకుని ఉన్న చెట్లపైనా, భవనాల సన్ సైడ్స్ పైనా కొందరు యువకులు ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చోవడాన్ని పవన్ గమనించారు. ఈ సమయంలో సభావేదికపైకి వచ్చిన పవన్.. ప్రసంగం మొదలుపెట్టే ముందు అభిమానులకు ఒక హెచ్చరిక చేశారు. దయచేసి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కూర్చోవద్దు.. మీశరీరానికి చిన్న గాయమైనా నా గుండే బరువెక్కుతుంది, ఏడుపొస్తుంది అని హెచ్చరించారు కూడా. అయితే.. నిజంగా పవన్ ఊహించినట్లే ఒక ప్రమాదం జరిగింది.