Begin typing your search above and press return to search.

మక్కాలో తొక్కిసలాట 310 మంది మృతి

By:  Tupaki Desk   |   24 Sept 2015 2:54 PM IST
మక్కాలో తొక్కిసలాట 310 మంది మృతి
X
మక్కాలో మరో దారుణం చోటు చేసుకుంది. నెల రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలకు సౌదీ సర్కారు బాధ్యత వహించేలా చేసింది. తాజాగా మక్కాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 310 మంది మరణించారు. మరో నాలుగు వందల మంది గాయాల పాలైనట్లు తెలుస్తుంది. హజ్ యాత్రలో భాగంగా మక్కాలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది.

భక్తుల రద్దీని అదుపు చేయటంలో విఫలమైన యంత్రాంగం పుణ్యమా అని భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో.. భారీ సంఖ్యలో మరణించారు. కడపటి సమాచారం ప్రకారం మరణించిన వారి సంఖ్య వందకు పైనే ఉంటుందని చెబుతున్నారు. అనధికార సమాచారం ప్రకారం తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 310 మంది ఉండొచ్చని.. అయితే.. పరిస్థితి గందరగోళంగా ఉండటంతో మరణించిన వారి సంఖ్యపై మరి కాసేపటికి స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. ఇక.. గాయపడిన వారిని మక్కాలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వారికి వైద్యసాయం అందేలా చూస్తున్నారు. ఘటనాస్థలి వద్ద దాదాపు 20వేల మంది ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ మధ్యలో మక్కా మసీదు ప్రాంగణం వద్ద నిర్మాణంలో ఉన్న భారీ క్రేన్ పైభాగం కూలిన ఘటనలో భారీ సంఖ్యలో మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకోవటం గమనార్హం. తాజా తొక్కిసలాట వార్త విన్న వెంటనే హజ్ యాత్రకు వెళ్లిన వేలాది భారతీయుల్లో బాధితులు ఎంతమంది ఉంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు.. బంధువులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. మక్కాలో చోటు చేసుకున్న భారీ తొక్కిసలాటతో అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.