Begin typing your search above and press return to search.

ఆ విషయంలో జగన్, కేసీఆర్ ల మద్దతు కోరిన స్టాలిన్ !

By:  Tupaki Desk   |   28 Aug 2020 1:40 PM IST
ఆ విషయంలో జగన్, కేసీఆర్ ల మద్దతు కోరిన స్టాలిన్ !
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే , కరోనా కేసుల గురించి పట్టించుకోకుండా కేంద్రం మాత్రం నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించడానికే మొగ్గుచూపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న నేపథ్యంలోనే .. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోమారు కీలక ప్రకటన చేశారు. నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ డీజీ తనతో చెప్పారని విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. నీట్‌ పరీక్షకు సంబంధించి కూడా 15.97 లక్షల అభ్యర్థులకు గానూ 10లక్షల మందికి పైగా అడ్మిట్ కార్డులను 24 గంటల్లో డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోందని రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.

అయితే , నీట్.. జేఈఈ పరీక్షలను ఈ యేడాది నిర్వహించకుండా వాయిదా వేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ డిమాండ్ చేశారు. దీని కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు . కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన జగన్, కేసీఆర్‌లను ఇందుకు కలిసి రావలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఒడిశా, కేరళ సహా మరో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. నీట్-జేఈఈ నిర్వహణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇక దీనిపై తాము ఏ నిర్ణయమూ తీసుకోలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. పంజాబ్ సీఎం .. పిల్లలకి పరీక్షలు పెట్టడం ముఖ్యమా లేక పిల్లలు ముఖ్యమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.