Begin typing your search above and press return to search.

స్టాలిన్ సక్సెస్ మంత్రం.. ఇదేనా? నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:20 AM GMT
స్టాలిన్ సక్సెస్ మంత్రం.. ఇదేనా?  నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!
X
ఇప్పుడు దేశంలో ఉన్న ముఖ్య‌మంత్రుల్లో ఉత్త‌మ సీఎం ఎవ‌రు? అని అడిగితే.. త‌డుముకోకుండా చెబుతున్న పేరు స్టాలిన్‌. వివాద ర‌హిత ముఖ్య‌మంత్రి ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే.. ఏమాత్రం సంకోచించ‌కుండా చెబుతున్న పేరు కూడా స్టాలినే. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు సైతం విమ‌ర్శించేందుకు ఏమీ లేకుండా చేసిన నాయ‌కుడు.. ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది కూడా స్టాలినే! అందుకే ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా.. స్టాలిన్ పేరు వినిపిస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఆయ‌న ఎలా స‌క్సెస్ అయ్యారు. అధికారం చేప‌ట్టి.. ప‌ట్టుమ‌ని ప‌ది నెల‌లు కూడా కాకుండానే ఆయ‌న ఎలా ఎవ‌ర్ గ్రీన్ ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్నారు?

స్టాలినేమ‌న్నా.. ప్ర‌జ‌ల‌కు వేలాది రూపాయ‌లు పందేరం చేశారా? పాద‌యాత్రలు చేశారా? లేక‌.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై కేసులు పెట్టారా? ఏం చేసి.. ఆయ‌న రికార్డు సాధించారు? ఇదీ.. ఇప్పుడు సాధార‌ణ పౌరుడినే కాదు.. రాజ‌కీయ నేత‌ల‌ను కూడా ఆలోచింప‌జేస్తున్న విష‌యాలు. విష‌యంలోకి వెళ్తే.. త‌మిళ‌నాడు అధికార మార్పిడి జ‌రిగి కొన్ని నెల‌లే అయింది. వ‌రుస‌గా ప‌దేళ్లు పాలించిన జ‌య‌ల‌లిత పార్టీని ప‌క్క‌న పెట్టిన ప్ర‌జ‌లు క‌రుణానిధి కుమారుడు.. స్టాలిన్‌ను గ‌ద్దెనెక్కించారు. నిజానికి ద‌క్క‌క ద‌క్కిన సీఎం పీఠాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. ప్ర‌తిప‌క్షానికి చుక్క‌లు చూపిస్తార‌ని భావించారు.

అదేస‌మ‌యంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌థ‌కాల‌ను ఎత్తేసి.. త‌న‌దైన శైలిలో విజృంభిస్తార‌ని అనుకున్నారు. ఇదే త‌ర‌హాలో వార్త‌లు, విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. నిజానికి ఇవ‌న్నీ చేసి ఉంటే.. ఆయ‌న పేరు ఇప్పుడు త‌లుచుకునేందుకు ఏమీ ఉండేది కాదు. కానీ, స్టాలిన్ అలా చేయ‌లేదు. అలా చేయ‌క‌పోవ‌డ‌మే.. ఆయ‌న‌కు ఈ సేతు హిమాచ‌లం అంత పేరు ను మోసుకొచ్చింది. నిజానికి ఉత్త‌మ సీఎం అనిపించుకోవ‌డం అంటే మాట‌లేం కాదు. ప్ర‌జ‌ల్లో మెప్పు పొందాలి. ప్ర‌తిప‌క్షాల నుంచి కితాబులు రావాలి. ప్ర‌ధాన ప‌త్రిక‌లు, మీడియాలోనూ మంచి అనిపించుకోవాలి. మ‌రి స్టాలిన్ ఎలా ఉత్త‌మ సీఎంగా నిలిచారు? అంటే.. ఆయ‌న చేసింది... కేవ‌లం అటుపుల్ల తీసి ఇటు పెట్ట‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇంత‌కీ స్టాలిన్ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన అత్యంత స్వ‌ల్ప కాలంలో చేసింది ఏంటంటే.. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఎక్క‌డా ర‌ద్దు చేయ‌లేదు. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తాయ‌ని అనుకున్న ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ ఆయ‌న కొన‌సాగించారు. ముఖ్యంగా అన్నాడీఎంకే జ‌య‌ల‌లిత ఫొటోల‌తో చేప‌ట్టిన అమ్మ క్యాంటీన్ల‌ను స్టాలిన్ మ‌రింత మెరుగు ప‌రిచారు. గ‌త ప్ర‌భుత్వం.. విద్యార్థుల కోసం.. జ‌య బొమ్మ‌ను ముద్రించి ఉన్న బ్యాగుల‌ను కోట్ల‌లో కొనుగోలు చేసింది. అయితే.. వాటిని పంచాల‌నుకునే స‌రికి ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ పార్టీ దిగిపోయింది. అయితే.. స్టాలిన్ వాటిని మూల‌న‌ప‌డేయ‌లేదు. ల‌బ్ధి దారుల‌కు అందించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అదేస‌మ‌యంలో త‌న‌ను పొగ‌డుతున్న సొంత పార్టీ నేత‌ల‌ను స‌భా ముఖంగానే హెచ్చ‌రించారు. పొగ‌డ్త‌లు వ‌ద్దు ప‌నిచేయండ‌న్నారు. అంతేకాదు.. అధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ముఖ్యంగా అసెంబ్లీలో త‌న‌కు ఎంత బ‌లం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని స్వ‌యంగా ఆయ‌నే స్పీక‌ర్‌కు సూచించారు. ఇలా.. అన్ని వ‌ర్గాల నుంచి మెప్పు పొందేందుకు స్టాలిన్ వేల కోట్ల రూపాయ‌లు అప్పులు చేయ‌లేదు. కోర్టుల నుంచి మొట్టికాయ‌లు తిన‌లేదు. కేవ‌లం చిన్న చిన్న నిర్ణ‌యాలు.. ఆలోచ‌న‌, వివేకంతో తీసుకున్న చిన్న నిర్ణ‌యాలు ఆయ‌న‌ను పెద్ద కొండ‌పై కూర్చోబెట్టాయి. మ‌రి ఇది.. ఏపీలోనూ అన్వ‌యం చేసుకుంటే.. జ‌గ‌న్ ప్ర‌భ వెలిగిపోదా?! అంటున్నారు నెటిజ‌న్లు!!