Begin typing your search above and press return to search.

దేశంలో మరెక్కడా లేని రీతిలో స్టాలిన్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:05 AM GMT
దేశంలో మరెక్కడా లేని రీతిలో స్టాలిన్ సంచలన నిర్ణయం
X
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసిన సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం లభించినప్పుడు.. పాలనా పరంగా పెను మార్పులు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. వ్యవస్థల్లో కొత్త విధానాల్ని తీసుకొచ్చే సాహసాల్ని కొందరు సీఎంలు చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి సంచలనంగా మారారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురవటమే కాదు.. కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా స్టాలిన్ అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వ్యక్తుల్ని అర్చకులుగా నియమిస్తూ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయం కారణంగా 24 మందికి అర్చకులుగా పని చేసే అవకాశం లభించింది. అయితే.. ఈ ఉద్యోగాలకు నియమితులైన వారంతా పూర్తిస్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

తాజా నిర్ణయంతో.. స్టాలిన్ తన ఎన్నికల హామీల్లో భాగంగా ఒక కీలక హామీని నెరవేర్చినట్లు చెబుతారు. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్టాలిన్ నేత్రత్వంలోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక కీలక అంశాన్ని చేర్చారు. దీని ప్రకారం.. అన్ని కులాల వారు దేవాలయ ఆర్చకులుగా విదుల్లో భాగస్వామ్యం కల్పిస్తామని స్టాలిన్ చెప్పారు. తానిచ్చిన హామీని స్టాలిన్ తాజాగా పూర్తి చేశారని చెప్పాలి.

ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. ఆగస్టు 14 నాటికి స్టాలిన్ సీఎం కుర్చీలో కూర్చొని వంద రోజులు అవుతుంది. తొలి శతకాన్ని ఘనంగా జరుపుకోవటానికి వీలుగా ఆయనీ నియామకాల్ని చేపట్టటం గమనార్హం. 24 మంది ఆర్చకులతో పాటు దేవాలయానికి సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 208 మందిని నియమించారు. వీరిలో వైష్ణవ పూజారులైన భట్టాచార్యులు.. శైవ సంప్రదాయాన్ని అమలు చేసే ఒధువార్లు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు.

స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయన తండ్రి మాజీ సీఎం కరుణానిధి కల నెరవేరినట్లుగా చెబుతున్నారు. సీఎం నిర్ణయాన్ని పలువురు మఠాధిపతులు.. స్వామీజీలు స్వాగతించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో మరెక్కడా లేదంటున్నారు మొత్తానికి పాలనలో తన మార్కు వేసేందుకు స్టాలిన్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.