Begin typing your search above and press return to search.

మీరూ ఇలా చేయండి.. బీజేపీయేతర సీఎంలకు స్టాలిన్‌ లేఖ!

By:  Tupaki Desk   |   13 April 2023 2:51 PM GMT
మీరూ ఇలా చేయండి.. బీజేపీయేతర సీఎంలకు స్టాలిన్‌ లేఖ!
X
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో గవర్నర్‌ తమిళి సై, సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్‌ లో గతంలో గవర్నర్‌ జగదీప్‌ ధనఖడ్, సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, లెఫ్టినెంట్‌ గవర్నర్, మహారాష్ట్రలో గతంలో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారీ, సీఎం ఉద్ధవ్‌ థాకరేల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఇదే పరిస్థితి డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులోనూ ఉంది. అక్కడ గవర్నర్‌ రవికి, సీఎం స్టాలిన్‌ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు తాజాగా లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌ లకు నిర్దేశిత కాలపరిమితిని విధించేలా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్‌ కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సహకార సమాఖ్య స్ఫూర్తి మసకబారుతోందని స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగం గవర్నర్‌ పాత్రతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొందని స్టాలిన్‌ తన లేఖలో గుర్తు చేశారు. గవర్నర్‌ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన వివిధ బిల్లులను నేడు కొందరు గవర్నర్లు నిరవధికంగా తమ వద్దే ఉంచుకుంటున్నారని స్టాలిన్‌ తప్పుబట్టారు ఇలాంటి నిర్ణయాలు ఆయా ప్రాంతాలలో రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తున్నాయని గుర్తు చేశారు.

తమిళనాడులో 'బిల్‌ టు బ్యాన్‌ ఆన్‌లైన్‌ రమ్మీ' సహా ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్‌ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి తాము అనేక ప్రయత్నాలు చేశామని స్టాలిన్‌ తెలిపారు. అయితే గవర్నర్‌ ను సంతృప్తిపరచడంలో తమ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.

తమిళనాడులో ఉన్న పరిస్థితే దేశంలో వివిధ రాష్ట్రాల్లోనూ ఉందని తెలుసుకున్నామని స్టాలిన్‌ తన లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్లులు ఆమోదించడానికి గవర్నర్‌ కు నిర్దేశిత కాలపరిమితిని విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానం చేశామన్నారు. ఈ తీర్మానాన్ని మీ పరిశీలన కోసం పంపిస్తున్నానని బీజేపీయేతర సీఎంలకు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

తాము పంపిన తీర్మానం స్ఫూర్తి, అందులోని అంశాలతో మీరు ఏకీభవిస్తారని భావిస్తున్నానని స్టాలిన్‌ తెలిపారు. మీ రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభల సార్వభౌమాధికారం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మీ మద్దతును అందిస్తారని భావిస్తున్నానని స్టాలిన్‌ తన లేఖలో పేర్కొన్నారు.