Begin typing your search above and press return to search.

రజినీకాంత్ పై పరోక్షంగా స్టాలిన్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   21 Dec 2020 9:30 AM GMT
రజినీకాంత్ పై పరోక్షంగా స్టాలిన్ హాట్ కామెంట్స్
X
తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ రంగ ప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధానంగా ఈసారి అధికారంలోకి వస్తుందనుకుంటున్న డీఎంకే పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ రాకను డీఎంకే అధినేత స్టాలిన్ దెప్పిపొడుస్తున్నారు. తాజాగా రజినీకాంత్ పై పరోక్ష విమర్శలు చేశారు.

స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు ఖాయమని.. దీనిని అడ్డుకునేందుకు కొత్త వాళ్లు పుట్టుకొస్తున్నారని అన్నారు. వారి చేత బలవంతంగా పార్టీలు ఏర్పాటు చేయిస్తున్నారని పరోక్షంగా రజినీకాంత్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్లాలిన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తాను జనవరి మొదటి వారం నుంచి ప్రచారం మొదలు పెడుతానని శ్రేణులకు పిలుపునిచ్చారు. ముందుగానే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలను డీఎంకే కైవసం చేసుకుంటుందని అన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు చేరువ అయ్యేందుకు గ్రామసభలకు డీఎంకే నిర్ణయించింది. ఈనెల 23 నుంచి జనవరి 10 వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లో ఈ సభలు నిర్వహించనున్నారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు స్టాలిన్ నిర్ణయించారు.