రాజకీయ నేతలపై కేసులు నమోదు కావడం సహజమే. ఆందోళనలు, నిరసనలు.. ఇలా వివిధ సందర్భాలతో పాటు ఎన్నికల సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చే ఆరోపణలతో కేసులు నమోదు కావడం చూస్తుంటాం. వాటిని ఆ నాయకులు పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ విషయం మర్చిపోతేనే మంచిదని సైలెంట్‌గా ఉండిపోతారు. ఇక తమపై వ్యతిరేకంగా కోర్టులో దాఖలయ్యే పిటిషన్లపై ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది అనుకుంటారు. కానీ తనపై దాఖలైన ఓ పిటిషన్‌ను బయటకు తీసి పరిష్కారించాలంటూ ఓ రాజకీయ నాయకుడు అదీ ఓ రాష్ట్ర సీఎం విన్నవిస్తే ఆశ్చర్యమే కదా. తమిళనాడు సీఎం స్టాలిన్ అదే చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన పాలనతో ఆయన దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ రూటే సపరేటు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 2011 ఎన్నికల సమయంలో తనపై ప్రత్యర్థులు వేసిన పటిషన్‌ను విచారించి తీర్పు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. ఆ ఏడాది శాసనసభ ఎన్నికల్లో కొలత్తూర్ నుంచి స్టాలిన్ 2,739 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఎన్నికలో విపరీతంగా డబ్బు పంచారని, ఈసీ పరిమితులను దాటి ఖర్చు పెట్టారంటూ అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్.దురైసామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.
2017లో ఈ పిటిషన్‌ను హై కోర్టు కొట్టేసింది. కానీ ప్రత్యర్థి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అదక్కడ అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్‌కు పరిష్కారం చూపమని స్టాలిన్ కోరడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో న్యాయవాది అమిత్ ఆనంద్ ఆ కేసు వివరాలను ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఆ ఎన్నికల్లో స్టాలిన్ గెలిచారు కదా ఇప్పుడు సమస్య ఏమిటీ? అని ధర్మాసనం ప్రశ్నించింది. "అవినీతి ఆరోపణలతో నాలుగైదేళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లయింట్ ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఆ అపవాదు అలాగే ఉండిపోయింది అందుకే సత్వర పరిష్కారం కోరుతున్నాం" అని సిబల్ వివరించారు. అప్పట్లో ఏ ధర్మాసనం ఈ కేసును పరిశీలించిందో చూడాలని సీజేఐ అన్నారు. ఇప్పటికే తన చర్యలతో ఆదర్శంగా నిలుస్తున్న స్టాలిన్.. ఇప్పుడీ విషయంతో మరింతగా ఆకట్టుకున్నారనే చెప్పాలి.