Begin typing your search above and press return to search.

ఒక పద్దతి ప్రకారం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   30 April 2022 7:30 AM GMT
ఒక పద్దతి ప్రకారం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారా?
X
పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు ప్రతి రోజు లీకవుతున్నాయనే వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రతి పరీక్ష పేపర్ ఎక్కడినుండో ఒకచోట నుండి లీకవుతునే ఉంది. అనంతపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల నుంచి పేపర్లు లీకైనట్లు అధికారులు గుర్తించారు. సరే పేపర్ లీక్ చేసిన వారిని గుర్తించటం, అదుపులోకి తీసుకోవటం, చర్యలు తీసుకోవటం అనేది ఎలాగూ జరుగుతుంది. కానీ పరీక్షలను ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయన్నదే ప్రశ్న.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పటివరకు లీకైన పేపర్లకు బాధ్యులు టీచర్లు, క్లర్కులు, వాటర్ బాయ్స్ అని తేలింది. అలాగే తిరుపతిలో పేపర్ లీకవ్వటానికి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. శ్రీకాకుళంలో కూడా ప్రశ్నపత్రం లీకైందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని అధికారులు తేల్చారు. ఒకవైపు ప్రశ్నపత్రాలు లీకైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రశ్నపత్రాలు లీకు కాదని అది మాస్ కాపీయింగ్ అని పోలసులంటున్నారు.

లీకేజీ అయినా, మాస్ కాపీయింగ్ అయినా ఏదో ఒకటి జరుగుతోందన్నది వాస్తవం. దీనివల్ల కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న లక్షలమంది విద్యార్ధుల్లో నైరాస్యం పెరిగిపోవటం ఖాయం. విచిత్రం ఏమిటంటే ప్రశ్నపత్రాల లీకేజీ-మాస్ కాపీయింగ్ లో టీచర్ల పాత్ర కూడా ఉండటం.

నంద్యాలలో జరిగిన ఘటనలో ఏకంగా 12 మంది టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పరీక్ష జరిగే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధిని వాటర్ బాయ్ రూపంలో పరీక్ష హాల్లోకి పంపేట్లుగా మాట్లాడుకున్నారు.

ప్రశ్నపత్రాన్ని ఆ స్కూల్లోని క్లర్క్ ద్వారానో లేకపోతే బయటనుండి పరీక్షలు జరుగుతున్న తరగతిగది గోడపైకెక్కి కిటికీ దగ్గర నుండి సెల్ ఫోన్ తో ఫొటోలు తీయించి ప్రశ్నపత్రాన్ని తెప్పించుకున్నారు. ఇవన్నీ తర్వాత విచారణలో బయటపడటంతో 12 మంది టీచర్లను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు పంపారు. ఇపుడు టీచర్ల ఉద్యోగంతో పాటు వాళ్ళ 12 మంది పిల్లల భవిష్యత్ కూడా దెబ్బతిన్నది. ఒకపద్దతి ప్రకారం పేపర్ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే లీకేజీని కంట్రోల్ చేయటానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగటంలేదు.

ప్రతిపక్షాలు ఈ పరిణామంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లో ఏ నాడూ ఇలా వరుసగా లీకులు జరగలేదు. ఈ క్లర్కులు, ప్రిన్సిపాల్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే... ఈ లీకులపై తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా కష్టపడి చదివిన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యేలా ఉంది.