Begin typing your search above and press return to search.

కారుమూరికి 'రెడ్డి' పోటు!

By:  Tupaki Desk   |   7 Jan 2022 2:30 AM GMT
కారుమూరికి రెడ్డి పోటు!
X
151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తణుకులో తగవు మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు, సొంత పార్టీకే చెందిన ఇతర నేతలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. గత ఎన్నికల నుంచే విభేదాలు ఉన్నప్పటికీ తాజాగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలే తనకు ఇబ్బందులు తెచ్చాయని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు.

ఈ నెల 2వ తేదీన తణుకులో వైఎస్సార్ పెన్షన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ తణుకు శాఖ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డి, ఎమ్మెల్యే నాగేశ్వరరావు మధ్య వివాదం రచ్చకెక్కింది. తాను లేకుండానే కార్యక్రమాలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే నిలదీశారు. వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా అని రెడ్డిని ఆయన నిలదీశారు.

అయితే, ఎమ్మెల్యే తన తల్లిని దూషించారంటూ ఎస్ఎస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కూడా పాత విషయాలన్నీ బయటకు తవ్వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ బర్త్ డే చేశానని.. అదే తన కొంప ముంచిందని అన్నారు.

ఇక్కడ అర్జెంటుగా ఓ వ్యక్తి ఎమ్మెల్యే అయిపోవాలని కోరుకుంటున్నారు... తణుకులో రెడ్ల అందరూ నాకు మద్దతుగా నిలిచారు... ఇప్పుడీ రెడ్డి ఎమ్మెల్యే అయిపోదామనుకుంటున్నారు అంటూ ఎస్ఎస్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎస్ఎస్ రెడ్డి తనను వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేశానని కొంత మందికి తనపై ఈర్ష్యగా ఉందని.. ఎదురుగా వస్తే పోరాడ వచ్చని.. కానీ, వెనుక నుంచి పొడిచే వాళ్లను ఎక్కడ తట్టుకుంటామని అన్నారు. ఈ పంచాయతీ ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి.... వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు చేరింది. మరి... వచ్చే ఎన్నికల్లో కారుమూరి నాగేశ్వరరావు తన టిక్కెట్ నిలుపుకుంటారో లేదంటే రెడ్డికి అర్పించుకుంటారో వేచి చూడాల్సిందే.