Begin typing your search above and press return to search.

జగన్ , చంద్రబాబులపై సుజనా సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 Feb 2021 4:30 AM GMT
జగన్ , చంద్రబాబులపై సుజనా సంచలన వ్యాఖ్యలు
X
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుపై బీజేపీ ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సుజనా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రయోజనాలను సాధించటంలో జగన్ ఫెయిలైనట్లు మండిపడ్డారు. జగన్ ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా ఉపయోగం కనబడలేదన్నారు. అసలిన్నిసార్లు జగన్ ఢిల్లీకి వచ్చి ఏమి సాధించారంటూ ప్రశ్నించారు.

తనపై ఉన్న కేసుల ఉపసంహరణకు జగన్ ప్రయత్నాలు చేసుకున్నట్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయటం లేదంటు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మౌళిక సదుపాయల కల్పనకు ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరి నిధుల కేటాయింపు ఎలా జరగాలో మాత్రం వివరించలేదు.

జగన్, చంద్రబాబులు ప్రధానమంత్రులు అయినా ఏపికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని తేల్చి చెప్పేసిన విషయం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన రూ 20 వేల కోట్లను తెచ్చుకోవటం కూడా రాష్ట్ర నేతలకు చేతకావటం లేదని దెప్పిపొడిచారు. మొత్తానికి సుజనా టీడీపీలో ఉన్నంత కాలం కేంద్రాన్ని ఏమీ మాట్లాడలేకపోయారు. ఇపుడు బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత జగన్+చంద్రబాబులను ఒకే గాటన కట్టేసి ఆరోపణలు, విమర్శలు చేస్తుండటమే విడ్డూరంగా ఉంది.