Begin typing your search above and press return to search.

తెలంగాణలో కళకళ.. ఏపీలో వెలవెల

By:  Tupaki Desk   |   9 Sep 2019 7:27 AM GMT
తెలంగాణలో కళకళ.. ఏపీలో వెలవెల
X
ప్రభుత్వ రవాణా సంస్థలపై గతంలో ఓ విమర్శ, ఆరోపణ ఉండేది.. ఆర్టీసీ బస్సులను కావాలనే సమయం కంటే కాస్త ఆలస్యంగా నడిపి - ప్రయివేటు బస్సులు ముందుగా వెళ్లేలా చేసేవారని.. తద్వారా వారి నుంచి కమీషన్లు తీసుకునేవారని ఆరోపణలుండేవి. ఇప్పుడు ఏపీ టూరిజం డిపార్టుమెంటు తీరుపైనా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. నాగార్జున సాగర్‌ లో ఫుల్లుగా నీరు చేరడంతో సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలు తిప్పుతారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ - ఏపీ టూరిజం శాఖలు వేర్వేరుగా తిప్పుతూ ఆదాయం పొందుతున్నాయి. అయితే.. ఈ ఏడాది ఫుల్లగా నీరున్నా కూడా ఇంతవరకు ఏపీ లాంచీలు మొదలుపెట్టలేదు. తెలంగాణ మాత్రం మూణ్నాలుగు రోజులుగా లాంచీలు తిప్పుతూ పర్యాటకుల నుంచి మంచి ఆదాయం పొందుతోంది.

అనుమతులు లేవంటూ సాగర్ - శ్రీశైలం లాంచీలను ఇంతవరకూ ఏపీ పర్యాటక శాఖ ప్రారంభించక పోవటంపై పర్యాటకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ జలాశయం ఒక్కటే అయినా ప్రాజెక్టుకు ఒక పక్క తెలంగాణ - మరోపక్క ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్లు ఉన్నాయి. సాగర్ నీటిమట్టం 565 అడుగులు దాటాక సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీలు నడిపే అవకాశం ఏర్పడుతుంది.

నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉన్నా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీలు నడిపేందుకు ఏపీ పర్యాటక శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ సర్వీసును శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నోముల నరసింహయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ పర్యాటక శాఖ మాత్రం అటవీ శాఖ అనుమతులు రాలేదనే కారణంతో లాంచీలను ప్రారంభించలేదు. తెలంగాణ పర్యాటక శాఖను ప్రోత్సహించేలా ఏపీ పర్యాటక శాఖ వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఏపీలో పాలనలో ఏర్పడిన అయోమయం.. అన్ని శాఖల్లో ఏర్పడిన నిర్లిప్తత తెలంగాణకు బాగా ఉపయోగపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా లాంచీలు నడపకపోవడమనేది మంచి విషయమే అయినా వర్షాలకు నీరొస్తాయని తెలిసి.. పర్యాటకులు వస్తారని తెలిసి కూడా ఇంతవరకు ఎందుకు అనుమతులు పొందలేదు.. అనుమతులు ఎందుకు రాలేదు? ఎక్కడ లోపం ఉందన్నదీ విశ్లేషించుకోవడమో.. తొందరగా అనుమతులు సంపాదించి లాంచీ సర్వీసులు ప్రారంభించే ప్రయత్నమూ కనిపించడం లేదని టూరిజం శాఖ విశ్రాంత ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు.