Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముళ్లు దాడులు మానడం లేదే!

By:  Tupaki Desk   |   13 Sep 2017 12:31 PM GMT
తెలుగు త‌మ్ముళ్లు దాడులు మానడం లేదే!
X
అధికారులపైన - అభిమానులపైన - కార్యకర్తలపైనా దాడులు చేయడంలో తెలుగుదేశం నేతల శైలే వేరు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రీతిలో ఎవ్వరేమనుకున్నా పట్టించుకోరు. డిప్యూటీ తహసీల్లార్ పై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ ను - అదేవిధంగా తణుకులో పోలీసులపై దాడులు చేసి వారిని పోలీస్ స్టేషన్ లలో బంధించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను - ఎయిర్ పోర్ట్ అధికారులపై దాడి చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలను ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

మొన్నటికి మొన్న పూలదండ వేయబోయిన అభిమాని చెంపను సినీనటుడు - హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పగులకొట్టిన సంగతి తెలిసిందే.తాజాగా ఇలాంటి సంఘటనే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిరుమలగిరిలో తెలుగుదేశం నేతలు పర్యటించారు. ఇందులో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ - ఆయన సోదరుడు ధనుంజయ్ (చిన్నబాబు) - కార్యకర్తలు పాల్గొన్నారు.

అయితే కార్యక్రమం జరుగుతుండగానే రాంబాబు అనే సీనియర్ టీడీపీ కార్యకర్త దగ్గరకు వెళ్లిన ఎమ్మెల్యే సోదరుడు.. అతనిపై పిడిగుద్దులు కురిపించారు. అంతటితో ఆగకుండా ఆయన అనుచరులతో కూడా కాళ్లతో తన్నించడం గమనార్హం. ఒక టీవీ చానల్ కు మా అవినీతి - అక్రమాలు గురించి చెబుతావా అంటూ కార్యకర్తపై దాడి చేశారని బాధితుడు అంటున్నాడు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కానీ - మాజీ మంత్రి నెట్టెం రఘరామ్ కానీ కనీసం పట్టించుకోలేదని రాంబాబు వాపోయాడు. ఎమ్మెల్యే సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ట త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు.