Begin typing your search above and press return to search.

కూచిబొట్ల శ్రీ‌నివాస్ హంత‌కుడికి జీవిత ఖైదు

By:  Tupaki Desk   |   5 May 2018 8:39 AM GMT
కూచిబొట్ల శ్రీ‌నివాస్ హంత‌కుడికి జీవిత ఖైదు
X
అమెరికాలో జాత్యాహంకారి చేతిలో హ‌త్య‌కు గురైన తెలుగు ఎన్నారై శ్రీ‌నివాస్ కూచిబొట్ల ఉదంతం అంద‌రినీ కల‌చివేసిన ఉదంతం మ‌న‌కు తెలిసిందే. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగిన ఘ‌ట‌న‌లో పురింట‌న్ అనే వ్య‌క్తి ఆస్టిన్ బార్‌లో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌లో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో అలోక్ మ‌ద‌సానిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. జాతి వివ‌క్ష‌తోనే పురింట‌న్ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింట‌న్ అరుపులు పెట్టిన‌ట్లు సాక్షులు తెలిపారు. నిందితుడు పురింట‌న్‌ను అడ్డుకున్న అమెరికా శ్వేత‌జాతీయుడు ఇయాన్ గ్రిల్ల‌ట్ ఇదే ఘ‌ట‌న‌లో హీరోగా ఆవిర్భ‌వించాడు. సుదీర్ఘ వాదోప‌వాదాల‌న‌ అనంత‌రం శ్రీనివాస్‌ హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది.

విదేశీయులు అమెరికాలోని ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారన్న జాతివిద్వేష ప్రచారంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన కొత్తలో అమెరికాలో భారతీయులపై పలు చోట్ల దాడులు జరిగాయి.‘మీరు మా దేశం నుంచి వెళ్లిపోండి’ అని అరుస్తూ ప్యూరింటన్‌ గొడవకు దిగి శ్రీనివాస్‌ను తుపాకీతో కాల్పి చంపాడు. జాత్యాంహ‌కార దాడి, మార‌ణాయుధాలు క‌లిగి ఉండటం అనే అభియోగాలు పురింట‌న్‌పై న‌మోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న‌ను జాతి వివ‌క్ష దాడిగా విచార‌ణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అలోక్‌ అనే మరో భారతీయ యువకుడిని కూడా హత్య చేయాలని చూశాడని, ఈ దాడిని అడ్డుకోబోయిన ఒక శ్వేతజాతీయుడిని కూడా గాయపరిచాడని కేసు విచారణ సందర్భంగా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు కోర్డుకు తెలిపారు. అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని ప్యూరింటన్ పేర్కొంటూ పిటిష‌న్‌ కోర్టులో దాఖ‌లు చేశారు.

అయితే ప్యూరింగ్‌ టన్‌ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్‌ పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆడమ్‌ కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్‌ భార్య సునయన ఆహ్వానించదగ్గ విషయమ‌ని తెలిపారు. విదేశీయులపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని శ్రీనివాస్ బంధువులు కోరారు. శ్రీ‌నివాస్‌ అమెరికాలోని గార్మిన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.