Begin typing your search above and press return to search.

దేవుడు దయ మాటలు.. సారుకు దెబ్బేస్తాయ్ మంత్రిగారు

By:  Tupaki Desk   |   16 Dec 2020 5:30 PM GMT
దేవుడు దయ మాటలు.. సారుకు దెబ్బేస్తాయ్ మంత్రిగారు
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరులో వచ్చిన మార్పును గమనించారా? ఇప్పటివరకు తనకు తోచింది.. తాను మెచ్చింది మాత్రమే చేసే ఆయన.. తొలిసారి ఒత్తిడికి గురవుతున్న విషయం ఇట్టే కనిపిస్తోంది. హుటాహుటిన ఢిల్లీ పర్యటన చేసి రావటం.. అక్కడ నుంచి వచ్చిరాగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయటం.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు డేట్ ఇచ్చేయటం లాంటివి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్ని సైతం చెల్లించే దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు.

ఇదంతా ఎందుకంటే.. ప్రజల్లో తన మీద వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించటంతోనే.. ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటివేళ.. సారుకు ఇబ్బంది కలిగే మాట అధికారపక్ష నేతల నోటి నుంచి వస్తే ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. తాజాగా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

ఆయన మాట్లాడిన మాటల తీరు.. అర్థం చేసుకునే వారికి అర్థం చేసుకున్నంతగా అన్నట్లు ఉంది. డబుల్ బెడ్రూం ఇళ్లు అందరికి రావని.. దేవుడి దయ ఉంటే లాటరీలో వస్తుందన్నారు. రాష్ట్రంలో కట్టే ఇళ్లు చాలా తక్కువ అన్న ఆయన.. వాటిని కూడా లాటరీ పద్దతిలో కేటాయిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీగా ఇళ్లు కట్టలేదని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కడుతూనే ఉందన్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో ఎంపీ.. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా లబ్దిదారులకు కేటాయించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. పేదలకు కేటాయించే డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని.. గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. విధివిధానాలు బాగానే ఉన్నా.. లబ్థిదారులుఎంపిక కీలకం కానుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో.. దేవుడి దయ ఉంటే డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయి లాంటి మాటలతో లాభం కంటే నష్టమేఎక్కువన్న విషయాన్ని మంత్రిగారు గుర్తించినట్లు లేదు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయన్న ఆశతో ఉన్న వారు.. ఇకపై దేవుడి దయ ఉంటేనే వస్తుందన్న మాటలు నెగిటివ్ గా మారి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న చిన్న విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు గుర్తించనట్లు..?