Begin typing your search above and press return to search.

ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ మృతి.. కారణం ఇదే

By:  Tupaki Desk   |   2 April 2022 9:32 AM GMT
ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ మృతి.. కారణం ఇదే
X
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన దారుణానికి నిండుప్రాణం పోయింది. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందిన బాధితుడు శ్రీనివాస్ ను ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. అతడికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ బాధితుడు కోలుకోలేదు. తాజాగా శ్రీనివాస్ పరిస్థితి విషమించింది. హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున కన్నుమూశాడు.

శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్దిరోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆస్పత్రిలోని ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతినడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని.. చాలా మంది ఎలుకల దాడికి గురయ్యారని పేషంట్లు వాపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. శ్రీనివాస్ పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.

అతడిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండె వైఫల్యంతో ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా శ్రీనివాస్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో అతడిని ఎంజీఎంకు తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివసా్ పై ఎలుకలు దాడి చేశాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు.