Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళ్ళిపోతున్న లంకేయులు

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
విదేశాలకు వెళ్ళిపోతున్న లంకేయులు
X
శ్రీలంకలో పరిస్ధితులు అస్తవ్యస్ధంగా మారిపోవటంతో లంకేయులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. జనాలకు మూడుపూటల తిండి, కట్టుకోవటానికి సరైన బట్టతో పాటు కనీస అవసరాలు కూడా తీర్చేస్ధితిలో ప్రభుత్వం లేదు. అందుకనే విదేశాలకు వెళ్ళిపోదలచుకున్న వాళ్ళని ప్రభుత్వమే పంపేస్తోంది. తమ అర్హతకు తగ్గ ఉద్యోగాలను, విదేశాల్లో ఉంటున్న తమ బంధువుల ద్వారానో ఏదో రూపంలో విదేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుని వెళ్ళిపోతున్నారు.

గత ఏడాది మొత్తంమీద జారీఅయిన పాస్ పోర్టులు 91,331 మాత్రమే. అదే ప్రస్తుత సంవత్సరంలో మొదటి ఐదునెలల్లోనే జారీఅయిన పాస్ పోర్టులు 2.9 లక్షలు. ఈ సంఖ్యను బట్టే పాస్ పోర్టులు తీసుకుని ఏదో రూపంలో విదేశాలకు వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్న వారిసంఖ్య ఎంతుందో తెలిసిపోతోంది. ఇప్పటికే లక్షలాదిమంది లంకేయులు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

ఎక్కువమంది గల్ఫ్ దేశాల్లోను, తర్వాత అమెరికాలోను ఉద్యోగాల్లో ఉన్నారు. విదేశాల నుండి వస్తున్న డాలర్ల వల్లే శ్రీలంకలో విదేశీమారకద్రవ్యం కాస్తయినా ఉంది. మామూలుగా అయితే టూరిజం, మెడికల్ టూరిజం వల్ల అత్యధిక విదేశీమారకద్రవ్యం అందుతుంది. కరోనా వైరస్ కారణంగా టూరిజం, మెడికల్ టూరిజం రెండూ దెబ్బతినేశాయి. విదేశాల్లో చేసిన అప్పులు, చైనాకు కట్టాల్సిన అప్పులకు తోడు టూరిజం ఆదాయం పూర్తిగా దెబ్బతినేసిన కారణంగానే దేశంలో ఆర్ధికసంక్షోభం పెరిగిపోయింది.

సీన్ కట్ చేస్తే దేశంలో పరిస్ధితులు ఇప్పుడిప్పుడే కుదుటపడేట్లులేదు. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా రెండుపూటలా కడుపునిండా భోజనం చేసి నెలలైపోతోందట. పంటలు పండటంలేదు, పండినా రవాణా సౌకర్యాలు లేవు. వంటలు చేసుకోవటానికి గ్యాస్ దొరకటంలేదు. కిరోసిన్, పెట్రోల్, డీజల్ ఎక్కడా దొరకటంలేదు. ఈ కొరత కారణంగా ఇళ్ళు, పరిశ్రమలు, ఆఫీసుల్లో ఎక్కడా కరెంటు ఉండటంలేదు. అందుకనే దేశంలో అంతర్యుద్ధం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే విదేశాలకు వెళ్ళదలచుకున్న వారిని ప్రభుత్వం వెంటన పంపేస్తోంది. కనీసం ఇలా వెళ్ళేవారి వల్లయినా డాలర్లు వస్తాయని ఆశ. మొత్తానికి శ్రీలంకలో సంక్షోభం ఎప్పటికి కుదుటపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.