Begin typing your search above and press return to search.

శ్రీలంక బాంబు... పేలితే గట్టిగానే..?

By:  Tupaki Desk   |   5 April 2022 11:49 AM GMT
శ్రీలంక బాంబు... పేలితే గట్టిగానే..?
X
పాలిటిక్స్ లో ప్రతీ నిముషం విలువైనదే. జనాలతో ముడి పడి ఉన్న రంగం ఇది. కదిలే నదీ ప్రవాహం లాంటి వారు జనం. నిరంతరం ఆ ప్రవాహంలో ఎన్నో మార్పులు ఉంటాయి. పైకి నీరు నిశ్చలంగా ఉందని పొరపడినా త్వరపడినా ఫలితాలు తేడా కొట్టేస్తాయి. జనమంతా మనవారే అని భావించిన వారు సైతం చేదు ఫలితాలను దిగమింగాల్సి వచ్చింది.

జనాలకు ఏది అట్రాక్ట్ చేస్తుందో, ఏది భయానకంగా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇపుడు ఏపీలో కొత్త స్లోగన్ ఒకటి ముందుకొచ్చింది. అదే శ్రీలంక ఆర్ధిక సంక్షోభం. దాంతో ఏపీని ముడి పెట్టి రాజకీయ ముడి సరుకుని రెడీ చేసి పెట్టుకున్నారు. జగన్ సర్కార్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తోంది, అప్పుల కుప్ప ఏపీ ఇలా మూడేళ్లుగా ఊదరగొడుతున్నా పెద్దగా రిజల్ట్ అయితే లేదు.

సంక్షేమ ఫలితాలను అందుకున్న వాడు ఫుల్ హ్యాపీ. ఎక్కడ నుంచి అప్పు చేసి తెచ్చిపెడితే నాకెందుకు అన్నది ఆ వర్గాల ఆలోచన. ఇక అవి దక్కని వారి బాధ ఎపుడూ ఉన్నదే. వారంతా వైట్ కాలర్స్. వారు మాటల మనుషులే కానీ చేతల ఓటర్లు కారు. అయితే ఇపుడు శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం పీక్స్ లో ఉంది.

అక్కడ ఒక యాపిల్ పండు వంద రూపాయలు. అర కేజీ ద్రాక్ష రెండు వందల యాభై రూపాయలు. పెట్రోల్, డీజిల్ వంటివి ఏనాడో ఆకాశాన్ని అంటేశాయి. కోడి గుడ్డు కూడా వందల్లో ఉందంటే శ్రీలంక వెతలు చెప్పనలవి కాదు కదా. దాని గురించి మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కధనాలను చూసి దేశంలో జనాలు ఒక్క లెక్కన జడుసుకుంటున్నారు.

అదే పరిస్థితి మనకు వస్తే అన్న కంగారే వారిని నిలువెల్లా వణికిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో ప్రధాని మోడీ మూడు రోజుల క్రిత్రం వివిధ శాఖల కార్యదర్శులతో ఢిల్లీలో నిర్వహించిన ఒక కీలక సమావేశంలో కొందరు ఉన్నతాధికారులు దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రజాకర్షణ పధకాలను ప్రకటించి ఆర్ధిక వ్యవస్థను కుదేల్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఆర్ధిక కట్టడి లేకపోతే శ్రీలంక పరిస్థితులు అక్కడా ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణా, పశ్చిమ బెంగాల్ వంటివి చాలా ఉన్నాయి. కానీ ఏపీలో టీడీపీకి, దాని అనుకూల మీడియాకు ఇది బాగా దొరికేసింది. అంతే చంద్రబాబు ఇపుడు దాన్ని పట్టుకున్నారు. కొత్త స్లోగన్ చేసుకున్నారు.

శ్రీలంకలా ఏపీ కావాలని ఉందా అంటూ ఆయన ప్రజలనే ప్రశ్నించారు. కోడి గుడ్డు వేయి రూపాయలు అయితే కొనగలరా అని సూటిగా బాణాలు సంధించారు. మరో వైపు టీడీపీ అనుకూల మీడియా కూడా దీని మీద విస్తృత ప్రచారం చేస్తూ ఏపీ మరో శ్రీలంక అవుతుంది అని వార్తలు వండి వార్చేస్తోంది.

అప్పుల కుప్పగా ఏపీ ఉందని కూడా కధనాలు వెలువడుతున్నాయి. నిజంగా ఏపీలో అప్పులు ఉన్నాయి. అవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో దేశంలో కూడా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రాష్ట్రాలు అప్పుల పాలు అయితే సమాఖ్య వ్యవస్థలో ఆదుకోవడానికి కేంద్రం ఉంది. కానీ దేశం అప్పుల పాలు అయితే. ఇది బిగ్ క్వ‌శ్చన్.

అయినా ఏపీ వరకూ చూస్తే ఇది పవర్ ఫుల్ నినాదంగా చూడాలి. ఏ మాత్రం లైట్ తీసుకోకూడదు, జనాలు ఇపుడు దీని గురించి ఆలోచించడం మొదలుపెడితే మాత్రం వైసీపీకి రాజకీయంగా దెబ్బ పడుతుంది. అంతే కాదు వైట్ కాలర్స్ చేతల్లోకి దిగి ఓట్లేస్తే కనుక అధికార పార్టీకి బ్యాడ్ రిజల్ట్ వచ్చినా రావచ్చు.

అందువల్ల ప్రభుత్వం కూడా సర్దుకోవాలి. ఒకరు అన్నారని కాదు, ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఈ రోజే చూడాలి. మరో వైపు విపక్షం చేతిలో సరైన స్లోగన్ దొరికింది. దీన్ని ఎంతలా వాడాలో అంతలా టీడీపీ వాడడం తధ్యం. దాంతో దీన్ని తిప్పి కొట్టడానికి వైసీపీ ఏం చేస్తుంది అన్నది కూడా కీలక పాయింటే. శ్రీలంక బాంబు కనుక పేలితే మాత్రం గట్టిగానే ఉంటుంది మరి.