Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై భూకేటాయింపుల ఆరోపణలు

By:  Tupaki Desk   |   23 Nov 2015 9:58 AM GMT
చంద్రబాబుపై భూకేటాయింపుల ఆరోపణలు
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు స్వయంగా ఆయనే ఎదుర్కోవాల్సి వస్తోంది. భూముల కేటాయింపుల విషయంలో వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు - ఆయన బంధువులకు లెక్కాపత్రం లేకుండా భూములు కట్టబెట్టారంటూ వారు ఆరోపిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో ఎకరం రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలను చంద్రబాబు తనకు అనుకూలమైనవారికి కట్టబెట్టారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆరోపించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువులకు కోట్ల విలువైన రూ.498 ఎకరాల భూమిని తక్కువ ధరకు కేటాయించారన్నది ఆయన చేసిన మరో ఆరోపణ. రాయలసీమలో ఎంపీ గల్లా జయదేవ్‌ కు కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. తమ ఆరోపణల పైన చంద్రబాబు చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. లేదా దీని పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పద్దెనిమిది నెలల పాలనలో 700 చీకటి జీవోలు జారీ చేశారంటూ శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పారదర్శక పాలన అంటున్న చంద్రబాబు అవినీతికి గేట్లు ఎత్తేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను బంధువులకు కట్టబెడుతున్నారన్నారు. వందల కోట్ల విలువైన భూములు తమ వారికి కట్టబెట్టడం ఏ సామాజిక న్యాయమని నిలదీశారు. చంద్రబాబు దోపిడీపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.