Begin typing your search above and press return to search.

బొత్స మెడకు కల్తీ మద్యం కేసు

By:  Tupaki Desk   |   9 Dec 2015 10:05 AM GMT
బొత్స మెడకు కల్తీ మద్యం కేసు
X
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా విజయవాడ కల్తీ మద్యం కేసు ఇప్పుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మెడకు చుట్టుకుంటోంది... బొత్స వ్యాపారాలకు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఈ కేసుతో బొత్సకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీతో పాటు వైసీపీ నేతలూ బొత్సను టార్గెట్ చేస్తుండడంతో ఆయన తెగ బాధపడిపోతున్నారట.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించి, టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బొత్స విషయం ప్రస్తావించారు. తనకు అయిదు జిల్లాల్లో మద్యం వ్యాపారం ఉందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ గతంలో స్వయంగా ఒప్పుకున్నారని... మరి అలా ఐదు జిల్లాల్లో వ్యాపారం చేస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్న బొత్సను వైసిపిలో ఎలా కొనసాగిస్తారో చెప్పాలని జగన్ కు ఆయన సవాల్ చేశారు. వైసిపిలో ఉన్న నేతలు చాలామంది కల్తీ మద్యం వ్యాపారులేనని ఆరోపించారు. ఎన్నికల్లోనూ కల్తీ మద్యం పంపిణీ చేశారని ఆరోపించారు.

సరే... టీడీపీ నేతలు ఏదో ఆరోపించారులే అనుకుంటే వైసీపీ నేతలూ బొత్సనే టార్గెట్ చేశారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా బొత్స అందరికంటే ఆలస్యంగా వైసీపీలోకి వచ్చినా అందరికంటే పెద్దోడైపోయారు. దీంతో అందరూ బొత్సంటే మండిపడుతున్నారు. కానీ, అధినేత జగన్ వద్ద ఆయనకు పలుకుబడి పెరగడంతో ఏమీ అనలేని పరిస్థితి. వైసీపీలో బొత్స వ్యతిరేకులందరకూ ఇప్పుడు విజయవాడ ఘటన మంచి ఛాన్సును ఇచ్చింది. బొత్సలా భారీ ఎత్తున మద్యం వ్యాపారం చేస్తున్నవారిని పార్టీలో ఉంచితే ఎప్పటికైనా వైసీపీకి కూడా ఇలాంటి మచ్చే వస్తుందని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా డైరెక్టుగా విషయం చెప్పేశారు కూడా.. ‘’మద్యం విషయంలో పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. అలాంటప్పుడు పార్టీకి చెందిన నేతలు మద్యం వ్యాపారం చేయకూడదు’’ అని శ్రీకాంత్ రెడ్డి బుధవారం అన్నారు. పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నాక వైసిపి నేతలు మద్యం వ్యాపారం చేయడం సరికాదని ఆయన సూచించారు. పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా మద్యం వ్యాపారంలో ఉంటే తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీలో ఇలాంటి నిర్ణయం రావడంతో బొత్స ఉలిక్కిపడుతున్నారు. మద్యం వ్యాపారం ఆగిపోతే ఆయనకు భారీగా నష్టమొస్తుంది. అయితే.. వైసీపీ నేతల తీరు చూస్తుంటే జగన్ చేసిన సంపూర్ణ మద్య నిషేధం ప్రకటనను చూపిస్తూ బొత్స విషయం జగన్ కే చెప్తారని భావిస్తున్నారు. మొత్తానికి బొత్సపై రగిలిపోతున్న వైసీపీ నేతలకు ఇన్నాళ్లకు ఓ అస్త్రం దొరికిందన్నమాట.