Begin typing your search above and press return to search.

ఆయ‌న ఓకే అంటేనే శ్రీ ముంబ‌యికి!

By:  Tupaki Desk   |   27 Feb 2018 4:44 AM GMT
ఆయ‌న ఓకే అంటేనే శ్రీ ముంబ‌యికి!
X
దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన చాందిని శ్రీ‌దేవి మ‌ర‌ణం.. ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. శ్రీ మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేని వారికి.. ఇప్పుడామె మ‌రణానికి సంబంధించి వెలుగు చూస్తున్న అంశాలు మ‌రింత విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. అస‌లేం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు అర్థం కావటం లేదు.

స‌హ‌జ మ‌ర‌ణంగా చెప్పిన దానికి భిన్నంగా ప‌లు అంశాలు తెర మీద‌కు రావ‌టం.. ఒక‌దానికి మ‌రొక‌దానికి పొంత‌న లేక‌పోవ‌టంతో వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రింత క్లిష్టంగా మారిన‌ట్లు చెప్పాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్ వ‌చ్చేసింది.. మ‌రికాసేప‌ట్లో శ్రీ పార్థిప‌దేహాన్ని ముంబ‌యికి త‌ర‌లిస్తున్నారంటూ బ్రేకింగ్ వేసిన టీవీ ఛాన‌ళ్ల వార్త‌ల‌న్నీ అబ‌ద్ధాల‌ని మ‌రోసారి రుజువైంది.ఆ మాట‌కు వ‌స్తే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) కూడా శ్రీ పార్థిప‌దేహం ముంబ‌యికి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. శ్రీ మ‌ర‌ణానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వెలువ‌డిన వెంట‌నే దుబాయ్ అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కేసును ప్రాసిక్యూట‌ర్ అల్ న‌యిబ్ కు అప్ప‌గించారు. ఇక‌.. ఈ విష‌యానికి సంబంధించిన విచార‌ణ బాధ్య‌త ఆయ‌న మీద‌నే ఉంటుంది. శ్రీ మ‌ర‌ణంలో ఎలాంటి నేరం జ‌ర‌గ‌లేద‌ని.. అదంతా స‌హ‌జ మ‌ర‌ణంగా ఆయ‌న‌కు ఆయ‌న ఫీల్ అయితే త‌ప్పించి శ్రీ భౌతిక‌కాయం ముంబ‌యికి తీసుకొచ్చే వీలుంటుంది.

ఆయ‌న ఓకే అంటేనే.. శ్రీ‌ని దుబాయ్ నుంచి ముంబ‌యికి తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుంది. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోరెన్సిక్ నివేదిక సింఫుల్ గా ఒక్క పేజీలో ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు నివేదిక కొన్ని ప‌దుల పేజీలు ఉంటుంద‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఫోరెన్సిక్ నివేదికలోని అంశాల‌తో ఆయ‌న సంతృప్తి చెంద‌న‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా హోట‌ల్ లోని సీసీ కెమేరా ఫుటేజ్ మొత్తం త‌న‌కు కావాల‌ని.. హోట‌ల్ సిబ్బందిని ప్ర‌శ్నించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. అంతేనా.. శ్రీ‌దేవి ఫోన్ కాల్ రికార్డుల‌తో పాటు.. భ‌ర్త బోనీని ఈ రోజు సుదీర్ఘంగా విచారించే వీలుంది. మొత్తంగా చూస్తే. శ్రీ ముంబ‌యి రావాలంటే.. ప్రాసిక్యూట‌ర్ అల్ న‌యిబ్ ఓకే చెబితేనే సాధ్యం. చివ‌ర‌కు రాజు కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేర‌న్న మాట‌ను అక్క‌డి వారు చెబుతున్నారు.