Begin typing your search above and press return to search.

రవిశంకర్ గురూజీకి తత్వం బోధపడింది...

By:  Tupaki Desk   |   22 April 2016 9:48 AM GMT
రవిశంకర్ గురూజీకి తత్వం బోధపడింది...
X
మొరటోడికి మొగలి పువ్విస్తే నలిపి నడిరోడ్లో పడేశాడని సామెత. ఐఎస్ టెర్రరిస్టులు మొరటోళ్లకు మొరటోళ్లు... మరి అలాంటి వారు ఇంకేమీ చేస్తారు? రీసెంటుగా ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ శాంతి దూత పండిట్ రవిశంకర్ చేసిన శాంతి ప్రయత్నాలకు వారు తీవ్రంగా స్పందించారట. ఐఎస్ ఉగ్రవాదులతో శాంతి చర్చల కోసం ప్రయత్నించి చొరవ చూపించానని.. కానీ, వారు ఏమాత్రం సుముఖత చూపించలేదని రవిశంకర్ గురూజీయే స్వయంగా వెల్లడించారు. వారికి శాంతి సందేశం పంపించగా అందుకు ప్రతిగా ఆ ఉగ్ర సంస్థ తనకు తల నరికి వేసిన వ్యక్తి శరీరం ఫొటోను పంపించారని ఆవేదన చెందారు. దీనిని బట్టి ఐఎస్ ఐఎస్ శాంతి చర్చలకు సుముఖంగా లేదని తేలిపోయిందని, అందుకే తన ప్రయత్నాలను నిలిపివేశానని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అంతేకాదు... తన శాంతి చర్చల ప్రయత్నం విఫలం కావడంతో రవిశంకర్ గురూజీకి తత్వం బోధపడినట్లుంది. వారి పనిపట్టాలంటే మిలటరీయేనని ఇప్పుడంటున్నారు. శాంతికి విఘాతం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఐఎస్ఐఎస్ ను శిక్షించాల్సిందేనని, ఆ పని చేయాల్సింది మిలిటరీయేనని రవిశంకర్ అన్నారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలున్న రవిశంకర్ గురూజీ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నారన్న వాదన ఒకటుంది. ఆ కారణంగానే ఆయన ప్రపంచాన్ని వణికిస్తున్నఐఎస్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు ట్రై చేశారు. ఒకవేళ అదికానీ సఫలమైతే ఆయనకు నోబెల్ బహుమతి గ్యారంటీయే. కానీ.... ఐఎస్ ఉగ్రవాదులకు ప్రపంచంలోని మిగతా తీవ్రవాదులు - ఉగ్రవాదులకు ఎంతో తేడా ఉంది. ఎల్టీటీఈ వంటి కరడుగట్టిన తీవ్రవాదులు కూడా శాంతి దూతలను తీవ్రంగా హెచ్చరించడం తక్కువే. కానీ, ఐఎస్ ఉగ్రవాదులు రవిశంకర్ తొలి ప్రయత్నంలోనే స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. మొండెం శరీరం వేరయిన ఫొటోను ఆయనకు పంపించారు. వారికి శాంతి చర్చల పట్ల సుముఖత లేదని చెప్పడానికి ఇది సంకేతమని రవిశంకర్ అంటున్నా కూడా ఆయనకు లోలోన భయంకలిగిందన్న వాదన ఒకటి ఉంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించేందుకు ఈ ఫొటో పంపించినట్లుగా అనుమానిస్తున్నారు. అందుకే రవిశంకర్ రెండో ఆలోచన లేకుండా ఆ ఆలోచన విరమించుకున్నారని టాక్.