Begin typing your search above and press return to search.

బడాయి సభ చిక్కుల్లో ‘గురూజీ’

By:  Tupaki Desk   |   17 Aug 2016 9:31 AM GMT
బడాయి సభ చిక్కుల్లో ‘గురూజీ’
X
కొద్దికాలం క్రితం ఢిల్లీలోని యమునా తీరంలో నభూతో.. అన్న రీతిలో వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ ను ప్రముఖ అధ్యాత్మిక గురువు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ ఫెస్టివల్ పై ఎన్ని ప్రశంసలు వెల్లువెత్తాయో.. అంతే స్థాయిలో విమర్శలు విరుచుకుపడ్డాయి. ఈ కార్యక్రమం కారణంగా యమునా నదీ పరీవాహక ప్రాంతం భారీగా దెబ్బతిన్నదన్న ఆరోపణ ఉంది. ఈ కార్యక్రమం కారణంగా భారీగా కాలుష్యం చోటు చేసుకుందని..పర్యావరణానికి నష్టం వాటిల్లిందంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో.. భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారన్న ఆనందం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గూరుజీకి ఎక్కువ కాలం నిలవలేదు.

ఇదిలా ఉంటే.. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ట్రైబ్యునల్ ఈ అంశంపై ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీనికి జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వం వహించారు. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ కారణంగా జరిగిన యమునా తీరానికి జరిగిన నష్టంపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా పరిశీలించి.. పరిశోధించి తాజాగా ఒక నివేదికను సిద్ధం చేశారు.

రవిశంకర్ గురూజీ నిర్వహించిన కార్యక్రమం కారణంగా యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని కమిటీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కారణంగా పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లిందంటూ 47 పేజీల నివేదికను కమిటీ ట్రైబ్యునల్ కు సమర్పించింది. కల్చర్ ఫెస్టివల్ కారణంగా కొంతమేర నష్టం జరిగిందన్న నివేదిక రావొచ్చన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు భిన్నమైన నివేదిక రావటంతో రవిశంకర్ గురూజీ చిక్కుల్లో పడినట్లే.