Begin typing your search above and press return to search.

అయ్యప్ప ఆలయంలోకి శ్రీలంక మహిళ ప్రవేశం

By:  Tupaki Desk   |   4 Jan 2019 1:16 PM IST
అయ్యప్ప ఆలయంలోకి శ్రీలంక మహిళ ప్రవేశం
X
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళలు వెళ్లడంపై ఇప్పటికే కేరళవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో తాజాగా మరో మహిళ కూడా అయ్యప్పను దర్శించుకోవడం సంచలనంగా మారింది. మొన్న అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన ఇద్దరు మహిళలూ 18 మెట్లపై నుంచి కాకుండా వీఐపీ మార్గంలో వెళ్లగా తాజాగా దర్శించుకున్న మహిళ మాత్రం 18 మెట్లెక్కి ఆలయంలోకి వెళ్లింది.

శ్రీలంకకు చెందిన శశికళ అనే 46 ఏళ్ల మహిళ భర్తతో పాటుగా ఆలయానికి చేరుకుని 18 మెట్లూ ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళను చుట్టుముట్టడంతో పోలీసులు ఆమెను అక్కడ నుంచి పంపేశారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఆమెకు అయ్యప్ప దర్శనం చేయించినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా శ్రీలంక మహిళ అయ్యప్ప స్వామి ఆయలంలో ప్రవేశించిన ఘటనపై హిందూసంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కేరళలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆందోళనలు పెద్దఎత్తున సాగుతున్నాయి. అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలు ప్రాంతాల్లో ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. మరోచోట బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఆందోళనకారులు పోలీసులపైనా దాడులు చేస్తున్నారు. ఆందోళనకారుల దాడుల్లో 45 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. 200లకు పైగా బస్సులను ధ్వంసం చేశారు. బంద్‌ కారణంగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 900 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.