Begin typing your search above and press return to search.

సిగరెట్ కోసం బయటకి వచ్చి..సస్పెండ్ అయ్యి ఇంటికి !

By:  Tupaki Desk   |   29 Jun 2021 10:30 AM GMT
సిగరెట్ కోసం బయటకి వచ్చి..సస్పెండ్ అయ్యి ఇంటికి !
X
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ముగ్గురు కీలక ఆటగాళ్ల పై శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా, ఓపెనింగ్ బ్యాట్స్‌ మెన్ గుణతిలకను సస్పెండ్ చేసినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీలంక ఆటగాళ్లక కేటాయించిన హోటల్‌ బయట ఈ ముగ్గురూ కనిపించారు. బయోబబుల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ఎవరూ అలా పిచ్చాపాటిగా బయటకు రాకూడదు. అయితే, ఈ ముగ్గురు క్రికెటర్లు బయటకు వచ్చిన సమయంలో ఆ వీధిలోని ఓ వ్యక్తి కారులో వెళుతూ మొబైల్‌‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.

ఆ వ్యక్తి వీడియో తీస్తుండటాన్ని గమనించిన డిక్విలా సిగరెట్ తాగేందుకు సిద్ధమవుతున్న మెండిస్‌ ను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. కానీ, మెండిస్‌ కు డిక్విలా చేసిన సైగలు అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ అంశాన్ని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్‌గా పరిగణించి, విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ ముగ్గరు క్రికెటర్లు బయో బబుల్‌ నిబంధనలను ఉల్లఘించారని రుజువు కావడంతో వారిపై తక్షణ వేటు వేశారు. ఇంగ్లండ్ టూర్‌ లో ఉన్న శ్రీలంక క్రికెట్ టీం ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓటమిపాలై లంక అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు మూట గట్టుకుంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్ల తీరు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. శ్రీలంక జట్టు ఇంగ్లండ్ టూర్ పూర్తి కాగానే టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఇప్పటికే శ్రీలంక చేరుకున్నారు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఈ మ్యాచ్‌ లు ఆడబోతోంది.