Begin typing your search above and press return to search.

దయనీయ పరిస్థితుల్లో శ్రీలంక.. చమురు ఆదా కోసం స్కూళ్లు మూసివేత

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:18 AM GMT
దయనీయ పరిస్థితుల్లో శ్రీలంక.. చమురు ఆదా కోసం స్కూళ్లు మూసివేత
X
దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుణ భారం అంతకంతకూ పెరిగిపోయిన వేళ.. ఆ దేశం దివాలా దిశగా అడుగులు వేయటం.. చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనంత కఠిన పరిస్థితుల్ని ఆ దేశం ఎదుర్కొంటోంది. తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటున్న ఆ దేశం.. చమురు నిల్వల్ని కాపాడుకోవటం కోసం అనూహ్య నిర్ణయాల్ని తీసుకుంటున్న పరిస్థితి. ఇందులో భాగంగా అత్యవసరం కాని సేవల్ని రెండు వారాల పాటు నిలిపివేస్తూ అరుదైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇందులో భాగంగా స్కూళ్లను మూసివేస్తున్నారు. చమురును ఆదాలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకలో పూర్తిస్థాయిలో పని చేస్తున్న విభాగాలు రెండు మాత్రమేనని చెబుతున్నారు.

అందులో ఒకటి ఆసుపత్రులు అయితే.. రెండోది కొలంబో నౌకాశ్రయం మాత్రమేనని చెబుతున్నారు. ఇప్పటికి పెట్రోల్ కోసం బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ప్రజలు తమకు అవసరమైన పెట్రోల్ కోసం గంటల కొద్ది సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.

ఇదిలా ఉండగా లంక ఆర్థిక సంక్షోభంపై ప్రజల్లో చెలరేగిన ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అధ్యక్షుల వారి సచివాలయంలో కీలక ద్వారాల్నిఆందోళనకారులు చుట్టుముట్టారు.

ఏప్రిల్ 9న ప్రధాన ద్వారాన్ని ఆందోళనకారులు దిగ్బందిస్తే.. తాజాగా మరో రెండు ఎంట్రీ పాయింట్లను కూడా వారు దిగ్బంధించారు. ముట్టడించిన 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనకారుల్లో ఒక బౌద్ధ మత సన్యాసి.. నలుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యంత దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆ చిట్టి దేశానికి భారత్ సాయం చేస్తోంది. ఇందులో భాగంగా జులై నుంచి నాలుగు నెలల పాటు ఇంధన కొనుగోళ్లకు క్రెడిట్ లైన్ ఇచ్చేందుకు భారత్ సిద్ధం కావటం.. మన దేశం నుంచి 3500 టన్నుల ఎల్ పీజీ శ్రీలంకకు చేరుకుంది. మొత్తంగా చూస్తే.. ఆర్థికంగా దారుణ డ్యామేజీలో ఉన్న శ్రీలంక పరిస్థితి ఇప్పటికిప్పుడు మారే పరిస్థితులు కనిపించటం లేదంటున్నారు.