Begin typing your search above and press return to search.

'శ్రీచైతన్య' విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత!

By:  Tupaki Desk   |   13 July 2023 6:19 PM GMT
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత!
X
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (75) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌ లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించిన అనంతరం... అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు చెబుతున్నారు!

ఇంగ్లండ్‌, ఇరాన్‌ లో సుమారు 16 ఏళ్ల పాటు మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన డాక్టర్ బీఎస్‌ రావు ఆయన భార్య డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి తో కలిసి ఇండియాకు తిరిగివచ్చారు. అనంతరం 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు.

అయితే తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. తర్వాత హైదరాబాద్ లో 1991లో బాయ్స్ జూనియర్ కాలేజీని ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా విస్తరించారు.

ప్రస్తుతం ఈ సంస్థ పేరుమీద దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సి.బి.ఎస్.ఇ. స్కూల్స్‌ ఉండగా.. మొత్తం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలుస్తుంది.

ఇలా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ పేరుతో బీఎస్ రావు విద్యా సంస్థలు స్థాపించి సేవలు అందించారు! ఆయన మరణంతో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల విద్యార్థులు, పూర్వ విధార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొదలు అంతా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు!