Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడు ప్లాన్ అదుర్స్...?

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:30 PM GMT
బాలయ్య చిన్నల్లుడు ప్లాన్ అదుర్స్...?
X
రాజకీయాల్లో బాలయ్యతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్ళూ కొనసాగుతున్న సంగతి విధితమే. పెద్దల్లుడు ఏకంగా నారా చంద్రబాబు కుమారుడు లోకేష్. దాంతో భావి ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికే ఫోకస్ అవుతున్నారు. బాలయ్య స్వయంగా తాను హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇక చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం మూడు వేల స్వల్ప తేడాతో ఓడిపోయారు.

ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. ఇద్దరు తాతలూ రాజకీయంగా దిగ్గజాలు. ఒక తాత ఎంవీవీఎస్ మూర్తి రెండు సార్లు విశాఖ లోక్ సభ నుంచి గెలిచి టీడీపీలో కీలక నేతగా వెలుగు వెలిగారు. ఇక మరో తాత కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ఏలుబడిలో పనిచేశారు. ఆయన ఏలూరు నుంచి అనేక సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మోస్ట్ నేత. అలా భరత్ రాజకీయాలలో అడుగుపెట్టి యువ నేతగా విశాఖలో తన జోరుని కొనసాగిస్తున్నారు.

ఆయన గత ఎన్నికల్లో విశాఖలో గెలుపు ఖాయమనుకున్నా అనేక కారణాల వల్ల ఓటమి చెందారన్న విశ్లేషణలు ఉన్నాయి. అప్పట్లో జనసేన టిక్కెట్‌పై పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ వల్ల టీడీపీ ఓట్లు చీలిపోవడంతో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంతే కాదు ఆయనకు చివరి నిముషంలో టికెట్ ఖరారు కావడం వల్ల కూడా ప్రచారాన్ని పూర్తిగా చేసుకోలేకపోయారు. అయితే ఆయనకు మంచి విషయం పరిజ్ఞానం ఉంది. విశాఖ సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా. ఉన్నత విద్యావంతుడుగా ఉన్నారు.

ఇక భరత్ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. దానికి ఇప్పటి నుంచే ఆయన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ప్రచారలోపం వల్లనే గతంలో ఓడానని ఈసరికే గ్రహించిన భరత్ ఈసారి ఆ పొరపాట్లు ఏవీ దొర్లకుండా తొందరగా తన పని ప్రారంభించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాలతో ఆయన తరచుగా కనిపిస్తూనే వీలైనంత వరకు ప్రజలకు చేరువవుతున్నారు. సాధారణ రాజకీయ నాయకుల మాదిరిగా పెద్ద సంఖ్యలో నాయకులు, అనుచరులతో జనాలను ఆయన కలవడంలేదు. ఇక్కడ ఆయన తనదైన సొంత శైలితో ముందుకు సాగుతున్నారు.

పెద్ద సమావేశాలు, జనాలను పోగుచేయడాలు వంటివి అసలు పెట్టుకోవడం లేదు. ఆయన సాధారణ ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. అతి తక్కువ మంది జనాలు ఉన్న చోటకు వెళ్ళి వారితో ముచ్చట్లు పెడుతున్నారు. వారితో తాను ఒకడిగా కలసిపోతున్నారు. సమస్యల మీద చర్చిస్తున్నారు. ఎలా చేస్తే అవి పరిష్కారం అవుతాయో కూడా వారి నుంచి తెలుసుకుంటున్నారు. తాను కూడా వారికి చెబుతున్నారు.

ఇలా సరికొత్త పంధాలో ఆయన చేస్తున్న ఈ ప్రచారం చాప కింద నీరులా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా సగం సమయం ఉండడంతో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం అంతటా ఇలాగే తిరిగి జనాలను నేరుగా కలుసుకోవాలనుకుంటున్నారు. దీని వల్ల ముఖా ముఖీగా భేటీ కావడం సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. జనాలకు కూడా భరత్ బాగా గుర్తుండిపోతారు. అందరి మాదిరిగా ఎన్నికల వేళకు వచ్చి పోయే నాయకుడు తాను కాదని చెప్పకనే చెప్పుకున్నట్లు అవుతుంది.

మొత్తానికి భరత్ అనుసరిస్తున్న ఈ కొత్త ప్రచార విధానం ఆయనకు మంచి పేరు తెస్తోంది. అదే విధంగా ఆయన నేల మీద నడచే మనిషి అని, యువకుడిగా ఉంటూనే ఎంతో తెలిసిన అనుభవశాలిగా ఉన్నారని జనాలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎంపీగా గెలవాలని భరత్ గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. నిజానికి విశాఖ మీద వైసీపీకి గురి ఉంది. పాలనారాజధానిగా వైసీపీ ప్రతిపాదించింది.

అందువల్ల ఇక్కడ ఎంపీని తిరిగి గెలిపించుకోవడం అవసరం. అయితే భరత్ ఇప్పటికే ఒక పద్ధతి ప్రకారం జనాల్లోకి దూసుకుపోతున్న విధనాం బట్టి చూస్తే వైసీపీకి ఇక్కడ రాజకీయంగా ఇబ్బందిని కలిగించే ఫలితాలు వస్తాయా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా భరత్ మీద జనాల్లో సానుకూలత అంతకంతకు పెరుగుతోంది. అధికార పార్టీ దీనిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.