Begin typing your search above and press return to search.

విశాఖ ఎంపీ సీటు మీద బాలయ్య అల్లుడి పట్టు

By:  Tupaki Desk   |   13 Jun 2023 6:00 AM GMT
విశాఖ ఎంపీ సీటు మీద బాలయ్య అల్లుడి పట్టు
X
విశాఖ ఎంపీ సీటు ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దేశంలో ప్రముఖ పార్లమెంట్ సీట్లలో ఇది ఒకటి. జాతీయ స్థాయిలో ఠక్కున తెలిసే ఎంపీ సీటుగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి విశాఖ ఎంపీ సీటుకు ఎపుడూ పోటీ ఉంటుంది. ఫైటింగ్ కూడా ఇంటెరెస్టింగ్ గా ఉంటుంది. ఇక గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు నాన్ లోకల్ పరం అవుతూ వస్తోంది. దాంతో యధాప్రకారం ఈసారి కూడా ఇతర జిల్లా నేతల కన్ను ఈ సీటు మీద ఉంది.

ఇక గోదావరి జిల్లాలకు చెందిన మాజీ ఎంపీ, దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ఆయన మనవడుగా గీతం వర్శిటీ చైర్మన్ గా ఉన్న శ్రీ భరత్ కూడా విశాఖ నుంచి ఎంపీ కావాలని చూస్తున్నారు. ఆయన 2019లోనే ఫస్ట్ టైం పోటీ చేసి జస్ట్ నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆనాడు శ్రీ భరత్ ఓటమికి కారణం జనసేన అని లెక్కలు చెబుతున్నాయి. జనసేన తరఫున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు ఏకంగా రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు వచ్చాయి. అవన్నీ కూడా టీడీపీ నుంచి చీల్చినవే కావడం విశేషం. అలా ట్రయాంగిల్ ఫైట్ లేకపోతే మంచి మెజారిటీతో శ్రీ భరత్ గెలుస్తారు అని కూడా ఈ లెక్కలు చెప్పాయి.

ఇదిలా ఉంటే 2019లో ఓడినా కూడా శ్రీ భరత్ నిరాశపడలేదు. మరో చాన్స్ ఉంది అని ఆత్మవిశ్వాసంతో ఉంటూ వచ్చారు. ఆయన ఓడిన తరువాత రోజు నుంచి మళ్లీ ప్రజలలో ఉంటూ వస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆయన తన రాజకీయ దూకుడు పెంచారు. విశాఖ పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన కలియతిరుగుతున్నారు. అంతే కాదు మారు మూల గ్రామాలు ప్రాంతాలలో ఆయన వరస పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం శ్రీ భరత్ విశాఖ సిటీ పరిధిలోని వార్డులను ముమ్మరంగా తిరుగుతున్నారు మీ కోసం మీ భరత్ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. వారి సమస్యలను వింటున్నారు. తనకు తోచిన రీతిలో పరిష్కారం చూపుతున్నారు. అదే టైం లో వారికి తాను అండగా ఉన్నాను అని చెబుతున్నారు.

ఇక వారి సాధకబాధకాలను తెలుసుకోవడమే కాకుండా వారితోనే కలసి భోజనం చేస్తున్నారు. ఈ విధంగా శ్రీ భరత్ దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి తిరిగి ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే క్యాడర్ కి స్పష్టం చేసిన శ్రీ భరత్ జనాలలో కూడా తానే ఎంపీ అని ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని చూసిన వారు ఇదంతా ముందు జాగ్రత్త చర్యగానే చూస్తున్నారు.

ఎందుకంటే ఒక వైపు పొత్తుల వల్ల ఏపీలో ఎక్కడ చూసినా తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడ తమ బెర్తులకు ముప్పు వస్తుందో అన్న కంగారు వారిలో ఉంది అని అంటున్నారు. దాంతో ఎవరికి వారు తామే ఆయా సీట్ల నుంచి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. శ్రీ భరత్ యువకుడు కావడంతో మాటలతో కాకుండా చేతలకే దిగుతున్నారు. ఆయన జనంలో ఉంటూ పార్టీని కలుపుకుంటూ పోతూ తానే ఎంపీ క్యాండిడేట్ అని రిజిస్టర్ చేసి పారేస్తున్నారు.

ఇదంతా ఎందుకు అంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తులు కుదురుతాయని అంటున్నారు. దాంతో విశాఖ ఎంపీ సీటు పొత్తులలో భాగంగా బీజేపీ కి వెళ్తుందని ప్రచారం మొదలైంది. ఇప్పటికే బీజేపీలో ఇద్దరు నేతల మధ్య విశాఖ ఎంపీ సీటు గురించి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అన్నది వార్తలుగా వస్తోంది.

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిల మధ్య పోటీ సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి విశాఖ ఎంపీ సీటు ఇస్తారని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు ఉంటే ఈ సీటు టీడీపీ వదిలేస్తుంది అన్న మాట కూడా ఉంది. దగ్గుబాటి పురంధేశ్వరి అంటే శ్రీ భరత్ కి పెద్దమ్మ వరస అవుతారు. దాంతో ఆమె శ్రీ భరత్ సీటుకు పోటీ వస్తుందా అన్న చర్చ సాగుతోంది.

ఇక గత ఎన్నికల్లో బాలయ్య తన చిన్నల్లుడు శ్రీ భరత్ కి విశాఖ ఎంపీ టికెట్ కోసం చంద్రబాబుకు సిఫార్స్ చేసి ఇప్పించారని అంటారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు రోడ్ షోలలో పక్కనే శ్రీ భరత్ ఉండి బాబు వద్ద మంచి మార్కులే సంపాదించారు. దాంతో ఆయనకు టికెట్ ఇవ్వవచ్చు అని కూడా అనుకున్నారు.

కానీ పొత్తులు టీడీపీకి ముఖ్యం కనుక బీజేపీ అడిగితే వదిలేసే సీట్లలో విశాఖ కూడా ఉంది అంటున్నారు. మరి శ్రీ భరత్ కి బాబు ఆ విధంగా హ్యాండ్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇటీవల ఒక యూ ట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో శ్రీ భరత్ మాట్లాడుతూ తప్పకుండా తానే విశాఖ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తాను అని చెప్పారు. పొత్తుల వల్ల తన సీటు పోతుందన్నది ఊహాగానాలే అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మరి శ్రీ భరత్ అంత పట్టుదల మీద ఉన్నారు. పట్టు పెంచుకుంటున్నారు. విశాఖ ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఏంటి అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.