సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బాగా డబ్బున్న హీరోకు ఎంగేజ్మెంట్ అవుతుంది. కానీ ఆ డబ్బంతా పోగానే హీరోయిన్ అతడితో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని వెళ్లిపోతుంది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా జనాల ఆలోచనలు దీనికి భిన్నంగా ఏమీ ఉండవు. డబ్బు, పేరు ఉన్నవాడు సరిగ్గా పెళ్లికి ముందు పెద్ద కేసులో చిక్కుకుంటే అవతలి వాళ్లు కంగారు పడి.. పెళ్లి రద్దు చేసుకుంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ కేరళ క్రికెటర్ శ్రీశాంత్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. రెండేళ్ల కిందటి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతడి పేరు బయటికి వచ్చాక జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఐతే కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చినా.. బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించినా.. కొన్ని రోజులకే అతణ్ని పెళ్లాడింది భువనేశ్వరి కుమారి. ఈమె రాజస్థాన్ కు చెందిన ఓ రాజ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం విశేషం.
తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన సంగతుల్ని మీడియాతో పంచుకున్నాడు శ్రీశాంత్. ‘‘జైపూర్ కు చెందిన భువనేశ్వరి కుమారితో 2006లో నాకు పరిచయమైంది. 2009 నాటికి ప్రేమికులయ్యాం. పెళ్లి చేసుకుందామనుకున్నాం. 2011 ప్రపంచకప్ తర్వాత పెళ్లి అనుకున్నాం. ఐతే ఆ ఏడాదే నా భుజానికి సర్జరీ జరగడంతో వాయిదా వేసుకున్నాం. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్నా. తీహార్ జైల్లో ఉన్నపుడు ఆత్మహత్య చేసుకుందామనిపించింది. కానీ అదే సమయంలో మా సోదరుడు భువనేశ్వరి తండ్రి నుంచి వచ్చిన మెసేజ్ చూపించాడు. ‘ఏమైనా అవనివ్వండి. ఈ పెళ్లి జరుగుతుంది. మా అమ్మాయి శ్రీశాంత్ నే పెళ్లి చేసుకుంటుంది’ అని ఆయన మెసేజ్ పెట్టారు. అది చూశాక చాలా సంతోషం వేసింది. నేను బతికాను అనిపించింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం మొదలైన నాలుగు నెలలకు మేం పెళ్లి చేసుకున్నాం. అప్పటికే నామీద జీవిత కాల నిషేధం కూడా పడింది. నా భార్య రాజకుటుంబానికి చెందిన అమ్మాయైనా చాలా వినమ్రంగా ఉంటుంది. మా ఇంట్లో బాగా కలిసిపోయింది. ఈ రెండేళ్లు నాకు తనిచ్చిన మద్దతు మాటల్లో చెప్పలేను’’ అని శ్రీశాంత్ చెప్పాడు.