Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిని ఎంక‌రేజ్ చేస్తే.. దెబ్బ‌తినేది వైసీపీనే!

By:  Tupaki Desk   |   14 May 2021 6:30 AM GMT
శ్రీరెడ్డిని ఎంక‌రేజ్ చేస్తే.. దెబ్బ‌తినేది వైసీపీనే!
X
గడిచిన నాలుగు రోజులుగా తెలుగు సోష‌ల్ మీడియాలో వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. వ‌ర్సెస్ న‌టి.. శ్రీరెడ్డిల మ‌ధ్య తీవ్ర వ్యాఖ్య‌లు పేలుతున్నాయి. ఎంపీపై శ్రీరెడ్డి ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ఎంపీ ర‌ఘురామరాజు కూడా తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. ఈ మొత్తం ప‌రిణామానికి కేంద్రం ఎక్క‌డ ఉంది? అని చూస్తే.. వైసీపీ వ‌ర్సెస్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుల మ‌ధ్య సాగుతున్న పోరేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాదించిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కానీ.. ఇత‌ర నేత‌ల‌కు కానీ .. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డం.. బీజేపీ నేత‌ల‌తో ట‌చ్ లోకి రావ‌డం వంటివి దుమారానికి దారితీశాయి.

అదేస‌మ‌యంలో అమ‌రావ‌తిని జ‌గ‌న్ వ‌ద్దంటే.. ర‌ఘురామ‌రాజు కావాల‌న‌డం, రాష్ట్రంలో తెలుగు మీడియం వ‌ద్ద‌ని జ‌గ‌న్ అంటే.. ఏకంగా పార్ల‌మెంటులోనే దీనిని వ్య‌తిరేకిస్తూ.. చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డం వంటివి అటు వైసీపీ, ఇటు ఎంపీ మ‌ధ్య గ్యాప్ పెరిగి గొడ‌వ‌కు పాదు కొల్పిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇది.. ఏకంగా సీఎం జ‌గ‌న్ బెయిల్ రద్దు కోరుతూ. ఎంపీ ర‌ఘు సీబీఐ కోర్టును ఆశ్ర‌యించే వ‌ర‌కు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఎంపీ ర‌ఘుపై ప‌లు జిల్లాల్లో కేసులు న‌మోదు అయ్యే వ‌ర‌కు కూడా వ‌చ్చింది. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ప‌రిస్థితి ఉప్పు-నిప్పుగా మారింది. ఈ క్ర‌మంలో ఎంపీ ర‌ఘు త‌న సొంత అజెండాను ప‌ట్టుకుని.. ప్ర‌ధాన మీడియాలో సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల‌.. ఇత‌ర నేత‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అయితే.. ఎంపీ ర‌ఘుకు స‌రైన కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీకి ఎంతో బ‌లం ఉంది. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. గ‌ట్టి సోష‌ల్ మీడియా ఉంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ మిన‌హా 150 మంది ఎమ్మెల్యేలు, 22 మంఇ ఎంపీలు, ఇక‌, ఎమ్మెల్సీలు, ఇత‌ర నేత‌లు.. ఫైర్ బ్రాండ్ నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరంతా.. ర‌ఘును ఒక‌ప్పుడు చెడుగుడు ఆడుకున్న‌వారే. అయిన‌ప్ప‌టికీ ర‌ఘు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలో.. ఇంత మంది ఉన్న‌ప్ప‌టికీ.. సినీ న‌టి.. స‌మాజంలో పెద్ద‌గా గుర్తింపు లేని.. స‌దభిప్రాయం కూడా లేని శ్రీరెడ్డిని వైసీపీ నేత‌లే రంగంలోకి దింపార‌నే ప్ర‌చారం జరుగుతోంది.

ఇక‌, ఈమె.. గ‌డిచిన నాలుగు రోజులుగా ఎంపీ ర‌ఘుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. దీనికి ఎంపీ కూడా కౌంట‌ర్ ఇస్తున్నారు. అయితే.. వైసీపీకి ఎంతో బ‌లం, బ‌లగం ఉండి కూడా ప్ర‌జ‌ల్లో సానుభూతి, స‌ద‌భిప్రాయం లేని శ్రీరెడ్డితో ఎంపీ ర‌ఘుకు కౌంట‌ర్ ఇప్పించ‌డం.. వివాదాన్ని పెద్ద‌ది చేసుకోవ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి వైసీపీ నేత‌ల దూకుడుతో ఎంపీ ర‌ఘు.. క‌నీసం త‌న‌ను గెలిపించిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వెళ్లే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇలాంట‌ప్పుడు శ్రీరెడ్డిఎంక‌రేజ్ చేయడం స‌రికాద‌ని.. వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆమెకు ఎంత ప్రాధాన్యం త‌గ్గిస్తే.. అంత మంచిద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.