Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రోలోను స్క్విడ్ గేమ్- మ‌నీ హీస్ట్?

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:28 AM GMT
హైద‌రాబాద్ మెట్రోలోను స్క్విడ్ గేమ్- మ‌నీ హీస్ట్?
X
రియాలిటీ గేమ్స్ ర‌న్నింగ్ ట్రైన్ ఎక్కాయి! అక్క‌డ వింత వికృత చేష్ఠ‌ల‌తో ప్ర‌జ‌లను భ‌య‌పెట్టే ప‌ని చేసాయి. ఒక‌ప్పుడు పాశ్చాత్య దేశాల‌కు మాత్ర‌మే పరిమిత‌మైన ఈ పిచ్చి ఇప్పుడు భార‌తీయ టీవీ ప‌రిశ్ర‌మ‌లోను ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. రియాలిటీ గేమ్స్ పేరుతో సినిమాలు కూడా తెర‌కెక్కుతున్నాయి. ఓటీటీల్లోకి ఇవి ప్ర‌వేశించి మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకుంటున్నాయ‌నేది సాంప్ర‌దాయ వాదుల వాద‌న‌. అదంతా అటుంచితే ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేందుకు ర‌న్నింగ్ మెట్రోలో పిచ్చి వేషాలు కూడా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి.

నిజానికి ఈ పిచ్చి ప‌రాకాష్ఠ వేషాల‌కు నేరుగా మెట్రో వారి అనుమ‌తులు కూడా మంజూరీ అయ్యాయిట‌. భార‌త‌దేశానికి పిచ్చిని వెట‌కారాన్ని ప‌రిచ‌యం చేయడానికి అధికారుల స‌హ‌కారం కూడా ఇప్పుడు ల‌భిస్తోంది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల పేరుతో కార్పొరెట్ కంపెనీల ధ‌నార్జ‌న కోసం స‌హ‌క‌రించేందుకు పాలకులు అధికారులు స‌హా ఎవ‌రైనా వెన‌కాడ‌డం లేదు.

తాజాగా నోయిడా మెట్రో రైలులో 'మనీ హీస్ట్-స్క్విడ్ గేమ్' పేరుతో వికృత‌మైన గెట‌ప్పుల్లో ప‌లువురు భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. 'మంజులిక' వేషధారణలో ఉన్న ఓ యువతి ప్రయాణికులను వెంబడించి భయపెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. మెట్రో రైళ్లలో ఇలాంటివి చిలిపి వీడియోలా లేక అవ‌హేళ‌న వీడియోలా? అన్న‌ది అటుంచితే స‌ద‌రు కార్పొరెట్ బ్రాండ్ కి కావాల్సిన ప‌బ్లిసిటీ ద‌క్క‌నుంది.

ఇంత‌కీ ఈ వేషాలు వేయించిన‌ది ఎవ‌రు? అంటే.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్రాండ్ మార్కెటింగ్ వ్యూహం ఇలా ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ఈ వీడియోలు తన అనుమతితో మెట్రో ప్రాంగణంలో చిత్రీకరించిన వాణిజ్య ప్రకటనలో భాగమని ధృవీకరించింది. ప్ర‌క‌ట‌న‌ల‌ షూటింగ్ కు ఎన్‌.ఎం.ఆర్‌.సి పాలసీ ఆమోదం పొందిందని నోయిడా అథారిటీ సీఈఓ ట్వీట్ లో స్పష్టం చేశారు. ఈ వీడియో క్లిప్ లను మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసినట్లు ఆమె అండర్ లైన్ చేయ‌డం కొస‌మెరుపు.

మొత్తానికి మెట్రోలు ఆదాయ మార్గాల కోసం ఇలాంటి వాటిని అన్వేషిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు పిచ్చిని ప‌రిచ‌యం చేస్తున్నాయి. ప్ర‌క‌ట‌న‌ల పేరుతో క్రియేటివిటీ మ‌రీ ప‌రాకాష్ఠ‌కు చేరుకుంటోంది. ఇలాంటివి ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదాన్ని పంచ‌వు. ఇలా భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేయ‌డం స‌రైనదేనా? అన్న‌ది ఆలోచించాలి. నోయిడా మెట్రో స్ఫూర్తితో హైద‌రాబాద్ మెట్రోలోను స్క్విడ్ గేమ్- మ‌నీ హీస్ట్ ప్ర‌వేశించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.