Begin typing your search above and press return to search.

తుపాకీ, క‌త్తితో న‌టి ఇంట్లోకి దూరి.. నెత్తురు క‌ళ్ల‌జూశాడు!

By:  Tupaki Desk   |   26 May 2021 6:52 AM GMT
తుపాకీ, క‌త్తితో న‌టి ఇంట్లోకి దూరి.. నెత్తురు క‌ళ్ల‌జూశాడు!
X
అచ్చం సినిమాల్లోని స‌న్నివేశం మాదిరిగానే ఓ దుండ‌గుడు.. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించాడు. అత‌ని చేతిలో ఓ క‌త్తి.. మ‌రో చేతిలో తుపాకీ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ల‌గానే ఎదురుగా ఓ మ‌హిళ క‌నిపించింది. ఆమె ఆ ఇంటి ప‌నిమ‌నిషి. ‘‘పోలీసులు నా వెంట ప‌డుతున్నారు.. న‌న్ను అర్జెంటుగా దాచిపెట్టు. లేక‌పోతే చంపేస్తా’’ అని హెచ్చ‌రించాడు. ఇది చూసిన ఆమె భ‌యంతో బిగుసుకుపోయింది.

సినిమాను త‌ల‌పించే ఈ ఘ‌ట‌న‌ ఓ న‌టి ఇంట్లో జ‌ర‌గ‌డం యాదృశ్చికం. మ‌రాఠీ న‌టి సోనాలీ కుల‌క‌ర్ణి ఇంట్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పుణెలోని పింప్రి చించ్ వాద్ లోని సోనాలీ కుల‌క‌ర్ణి ఇంట్లోకి గుర్తు తెలియ‌ని ఓ వ్య‌క్తి ఆయుధాల‌తో చొర‌బ‌డి పై విధంగా ర‌భ‌స చేశాడు.

దీంతో.. న‌టి సోనాలీ తండ్రి మ‌నోహ‌ర్ గ‌దిలోంచి వ‌చ్చి అత‌డిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ.. త‌న చేతిలోని క‌త్తితో దాడిచేశాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌నోహ‌ర్ గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి దుండ‌గుడు పారిపోయే ప్ర‌య‌త్నంచేశాడు. అప్ప‌టికే ఈ గొడ‌వ‌తో.. అరుపుల‌తో చుట్టుప‌క్క‌ల వాళ్లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

అంద‌రూ క‌లిసి ఆ నిందితుడిని ప‌ట్టుకొని పోలీసులకు అప్ప‌గ్గించారు. అత‌డి చేతిలో ఉన్న పిస్ట‌ల్ మాత్రం నిజ‌మైన‌ది కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.