Begin typing your search above and press return to search.

తెర‌పైకి ఎస్పీవై అల్లుడు!..భూమా' కు ఒక‌టి క‌ట్‌!

By:  Tupaki Desk   |   4 Jan 2019 3:04 PM GMT
తెర‌పైకి ఎస్పీవై అల్లుడు!..భూమా కు ఒక‌టి క‌ట్‌!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఎంతో స‌మ‌యం లేదు. వ‌చ్చే నెల‌లోనే నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశాలుండ‌గా - ఏప్రిల్ లోనే ఎన్నిక‌ల క్ర‌తువు ముగిసే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు పార్ల‌మెంటుకు కూడా ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టిదాకా ఎమ్మెల్యేలుగా ఉన్న కొంద‌రిని పార్ల‌మెంటుకు - ఎంపీలుగా ఉన్న మ‌రికొంద‌రిని పార్ల‌మెంటుకు పంపే దిశ‌గా ఇటు అధికార పార్టీతో పాటు అటు విప‌క్ష వైసీపీ కూడా ప‌రిశీల‌న‌లు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల నేత‌లు కూడా ఇప్ప‌టిదాకా ఉన్న ప‌ద‌విలో సంతృప్తి ఉంటే... స‌రేస‌రి... లేదంటే ప్ర‌త్యామ్నాయాల‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న వైనం కూడా చాలా కాలం క్రితం నుంచే మొద‌లైపోయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ స‌మీక‌ర‌ణాల‌కు తోడుగా ఇప్పుడు కొత్త‌గా తెరంగేట్రం చేసేందుకు వార‌సుల‌ను సిద్ధం చేసుకున్న నేత‌లు... తాము త‌ప్పుకుంటూ త‌మ వార‌సుల‌కు టికెట్ల ఇవ్వాల‌ని పార్టీ అధిష్ఠాల‌ను కోరుతున్నాయి. అదే స‌మ‌యంలో తాము బ‌రిలో ఉన్నా... ఈ ద‌ఫా త‌మ వార‌సుల‌కు అవ‌కాశం క‌ల్పించాల్సిందేన‌న్న వాద‌న చేస్తున్న నేతాశ్రీలు కూడా ఉన్నారు.

అలాంటి కోవ‌కు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి... ఇప్పుడు క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో వేడి పుట్టించేశారు. జిల్లా నుంచి మంత్రిగా ఉన్న భూమి అఖిల‌ప్రియ‌కు ఎర్త్ పెట్టే దిశ‌గా ఎస్పీవై రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. అయినా ఎస్పీవై రెడ్డి ఏమ‌న్నారు? ఆ ప్ర‌క‌ట‌న‌తో భూమా ఫ్యామిలీకి వ‌చ్చిన ఇబ్బంది ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో నంద్యాల లోక్ స‌భ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి విజ‌యం సాధించారు. అయితే ఎంపీగా ప్ర‌మాణం చేయ‌క‌ముందే ఆయ‌న పార్టీ ఫిరాయించేసి అప్ప‌టిదాకా కాస్తంత క్లీన్‌గానే ఉన్న త‌న ఇమేజీని చేజేతులారా డ్యామేజీ చేసుకున్నారు. ఆ త‌ర్వాత అనారోగ్య కార‌ణాల‌తో వీల్ చైర్‌ కే ప‌రిమిత‌మైన ఎస్పీవై... ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సారి కూడా నంద్యాల లోక్ స‌భ నుంచి తాను పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఎస్పీవై... నంద్యాల అసెంబ్లీ సీటు నుంచి త‌న అల్లుడు శ్రీ‌ధ‌ర్ రెడ్డి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పార్టీ అధిష్ఠానం చేయించిన స‌ర్వేల్లో త‌న‌కు - శ్రీ‌ధ‌ర్ రెడ్డికి కూడా గెలుపు అవ‌కాశాలున్న‌ట్లు కూడా తేలిపోయింద‌ని కూడా ఆయ‌న ఒకింత డేరింగ్ కామెంటే చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో భూమా అఖిలప్రియ‌కు వ‌చ్చిన ఇబ్బందేమిటంటే... ఆళ్ల‌గ‌డ్డ నుంచి అఖిల ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, త‌న తండ్రి దివంగ‌త భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. అయితే గుండెపోటు కార‌ణంగా నాగిరెడ్డి చ‌నిపోవ‌డంతో నంద్యాల అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భూమా అన్న కొడుకు బ్ర‌హ్మానంద‌రెడ్ది పోటీ చేసి గెలిచారు. అంటే ఆళ్ల‌గ‌డ్డ‌తో పాటు నంద్యాల కూడా ఇప్పుడు భూమా ఫ్యామిలీ ఆధీనంలోనే ఉన్నాయ‌న్న మాట‌. మ‌రి ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను కాద‌ని నంద్యాల అసెంబ్లీని ఎస్పీవై రెడ్డి త‌న అల్లుడికి ఎలా ఇప్పించుకుంటార‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ఱ‌శ్న‌. అంతేకాకుండా భూమా ఫ్యామిలీకి అప్పుడేదో సానుభూతి క‌లిసి వ‌స్తుంద‌ని బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇచ్చాం గానీ... ఇప్పుడు రెండు సీట్ల నుంచి భూమా ఫ్యామిలీ పోటీ చేసే స్థితిలో లేదు క‌దా అన్న దిశ‌గా పార్టీ అధిష్ఠానం భావ‌న‌గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆళ్ల‌గ‌డ్డ‌ను భూమా ఫ్యామిలీకి వ‌దిలేసి... నంద్యాల అసెంబ్లీని త‌న అల్లుడికి ఇప్పించుకునే దిశ‌గా ఎస్పీవై పావులు క‌దుపుతున్న‌ట్లుగా స‌మాచారం. అయితే త‌మ ఫ్యామిలీ చేతిలోని ఓ సీట్ల‌పై క‌న్నేస్తేనే స‌హించేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న అఖిల‌... ఎస్పీవై ప్ర‌క‌ట‌న‌తో అగ్గి మీద గుగ్గిల‌మ‌వున్నార‌ట‌. ఈ రెండు సీట్ల‌ను ఇప్పుడ‌ప్పుడే వ‌దిలేద‌ని కూడా ఆమె ఖ‌రాకండిగా చెబుతున్నార‌ట‌. పార్టీ అధిష్ఠానానికి ఎవ‌రెన్ని ఫిర్యాదులు చేసినా... త‌మ‌కు ఇబ్బంది లేద‌ని కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నార‌ట‌. మొత్తంగా త‌న ఫ్యామిలీకి ఎర్త్ పెట్టేందుకు ఎస్పీవై చేస్తున్న య‌త్నాల‌ను అఖిల అడ్డుకోగ‌ల‌దో? లేదా చ‌తికిల‌బ‌డి ఓ సీటును చేజార్చుకుంటుందో చూడాలి.