Begin typing your search above and press return to search.

వ‌ద‌ల‌ని కరోనా.. విజృంభిస్తున్న‌ మ‌రో కొత్త వేరియంట్ ఇదే!

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:23 AM GMT
వ‌ద‌ల‌ని కరోనా.. విజృంభిస్తున్న‌ మ‌రో కొత్త వేరియంట్ ఇదే!
X
గ‌త రెండేళ్లు ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించింది.. కోవిడ్‌. ఈ మ‌హ‌మ్మారి సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ వ్యాప్తంగా 61 కోట్ల మంది దీని బారిన‌ప‌డ్డారు. అలాగే 65 లక్ష‌ల మంది అతి దారుణ ప‌రిస్థితుల్లో మృత్యువాత ప‌డ్డారు. మ‌న‌దేశంలో 4.45 కోట్ల మంది కోవిడ్ బారిన‌ప‌డ‌గా 5.28 లక్ష‌ల మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంద‌ని అంచ‌నా. కేవ‌లం ఒక్క మ‌నుషులే కాకుండా ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ప‌త‌నం దిశ‌గా సాగేలా చేసింది.. కోవిడ్.

ఆ త‌ర్వాత వ్యాక్సిన్ల రాక‌తో కోవిడ్‌తో కొంత అడ్డుక‌ట్ట ప‌డింది. అయితే ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి త‌న వేరియంట్‌ల‌ను మార్చుకుంటూ కొత్త రూపాల్లో దాడి చేస్తోంది. ఇప్ప‌టికే ఒమిక్రాన్ బీఏ 4, బీఏ 5 కొత్త వేరియంట్లు ప్ర‌పంచ దేశాల్లో క‌ల్లోలం సృష్టిస్తుండ‌గా.. ఇప్పుడు మ‌రో కొత్త వేరియంట్ పిడుగులా వ‌చ్చి ప‌డుతోంది. ఇది బీఏ 4.6 అని చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ బీఏ 4 చెందిన ఉప ర‌క‌మేన‌ని అంటున్నారు.

బ్రిట‌న్‌లో బీఏ 4.6 కొత్త ర‌కం వ్యాప్తిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆగ‌స్టు నెల‌లో ఆ దేశంలో ప‌రీక్షించిన కోవిడ్ న‌మూనాల్లో 3.3 శాతం ఈ వేరియంట్లోనే ఉన్నాయ‌ని ఆ దేశ ఆరోగ్య విభాగం చెబుతోంది.
ఇక అగ్ర రాజ్యం అమెరికాలో బీఏ 4.6 వేరియంట్ విస్తృత వ్యాప్తిలో ఉన్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం ప్ర‌క‌టించ‌డం దీని విజృంభ‌ణ‌కు నిద‌ర్శ‌నం. అక్కడ సీక్వెన్సింగ్‌ చేపట్టిన కేసుల్లో 9 శాతానికి పైగా ఈ కొత్త వేరియంట్ బీఏ 4.6వే ఉన్నట్లు వెల్ల‌డించింది. కేవలం అమెరికా, బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే వ్యాప్తిలో ఉంద‌ని అమెరికా వ్యాధుల నియంత్ర‌ణ‌, నిర్మూల‌న విభాగం బాంబుపేల్చింది.

బీఏ.4. వేరియంట్‌ను ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో మొదటగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. అప్పటి నుంచి ఈ వేరియంట్‌తోపాటు బీఏ.5 కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాప్తిలో ఉంది. కాగా కొత్త వేరియంట్ బీఏ 4.6 ఖ‌చ్చితంగా ఎలా ఆవిర్భ‌వించింద‌నేది చెప్పలేక‌పోతున్నారు. అయితే, కొన్ని వేరియంట్ల కలయిక (రీకాంబినెంట్‌) వల్ల ఈ బీఏ 4.6 వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు నిపుణులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా వైరస్‌ రకాలు సోకినట్లయితే దాన్ని రీకాంబినెంట్‌గా పరిగణిస్తున్నారు. R346T మ్యుటేషన్‌కి చెందిన ఈ రకం కరోనా వైరస్‌లు చాలా దేశాల్లో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయ‌ని అంటున్నారు.

అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మాదిరిగానే బీఏ.4.6 వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మృతుల సంఖ్య కూడా స్వ‌ల్పంగానే ఉంద‌ని అంటున్నారు.

మ‌రో ప్రస్తుతం అధిక ప్రాబల్యం కలిగిన బీఏ5కి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం ఉన్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా బయటపడిన బీఏ 4.6కు రోగ నిరోధక వ్య‌వ‌స్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం మరింత ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.