Begin typing your search above and press return to search.

రోజాలో మరో ఆసక్తికర కోణం..

By:  Tupaki Desk   |   20 July 2019 7:43 AM GMT
రోజాలో మరో ఆసక్తికర కోణం..
X
మొదట సినిమాల్లో అగ్ర తారైంది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. అనంతరం బుల్లితెరపై జబర్ధస్త్ నవ్వులు పూయించింది. సామాజిక సేవా బతుకుజట్కా బండితో బాధితుల కష్టాలు తీర్చింది. ఇలా సినిమాలు, రాజకీయం.. బుల్లితెర మూడు విభిన్న రంగాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సత్తాను చాటుకున్నారు. అయితే రోజాలో ఈ మూడు కోణాలే కాదు.. మరో పార్శ్వం కూడా ఉందన్న విషయం తాజాగా వెలుగుచూసింది..

ఫైర్ బ్రాండ్ రోజా.. జబర్ధస్త్ రోజా.. బుల్లితెర ఇలవేల్పు రోజాతోపాటు ఇప్పుడు రోజాలో మరొక రోజా దాగి ఉందట.. ఆమె ‘ఆధ్యాత్మిక రోజా’. ఎమ్మెల్యే రోజాకు మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువట.. కార్తీక మాసం- శ్రావణంలో ఉపవాసాలు- ప్రత్యేక వ్రతాలు పూజలు చేయడం దగ్గర నుంచి దైవాలను బలంగా నమ్ముతారట రోజా. ప్రతీసారి తన నియోజకవర్గానికి.. ఇలవేల్పు తిరుమల వెంకన్నను తప్పనిసరిగా దర్శించుకుంటారు.

అయితే ఇప్పుడు రోజాలోని ఆధ్యాత్మిక కోణం ఎలా బయటకు వచ్చిందన్న సందేహాలు మీకు కలగడం సహజం. అందుకే ఇప్పుడు రోజాలోని ఈ కోణాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. తాజాగా రోజా వివిధ ధార్మిక విషయాలు, స్తోత్రాలు కలగలపి సంకలనం చేసిన ‘శ్రీపూర్ణిమ గ్రంథం’ను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నారట . ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీపూర్ణిమ గ్రంథాన్ని విడుదల చేయడానికి రోజా ఏర్పాట్లు చేస్తున్నారట..

ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా ఏపీ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక కోణంలో భారత వైదిక వాజ్మయంలోని ప్రధాన అంశాలతో ఈ గ్రంథం తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇలా రోజాలోని ఆధ్యాత్మిక కోణం తెలిసి ఆమె తీసుకువచ్చే గ్రంథం కోసం రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుండడం విశేషం.