Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే మొదటగా ఆ గేట్లు పోలవరంలోనే..

By:  Tupaki Desk   |   7 July 2020 1:34 AM GMT
ప్రపంచంలోనే మొదటగా ఆ గేట్లు పోలవరంలోనే..
X
ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం శరవేగంగా నిర్మాణమవుతోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సాగు, తాగునీటి అవసరాలు గణనీయంగా తీర్చే ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టును పూర్తిచేయడానికి పట్టుదలతో ముందుకెళ్తున్నారు. తాజాగా పోలవరంలో భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే మొదటగా ఈ అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా తెరిచే గేట్లను పోలవరంలో ఏర్పాటు చేస్తుండడం విశేషంగా మారింది. ప్రపంచంలోనే ఈ కొత్త టెక్నాలజీని కేవలం పోలవరంలోనే మొదటగా వినియోగిస్తున్నారు.

ప్రపంచంలోనే ఇంతవరకు ఉపయోగించని ఈ అధునాతన హైడ్రాలిక్ వ్యవస్ధ ద్వారా తెరిచే గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.వీటిని ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రాలిక్ గేట్లను బిగిస్తారు. దీనివల్ల వరదలు వచ్చినా.. రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.

గోదావరిలో వరద ఎక్కువైతే పోలవరం పనులు చేయడం కష్టమయ్యేది. అందుకే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పొందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. వరదలోనూ పనులు చేసే మొత్తం 48 గేట్లకు గడ్డర్ల బిగింపు పనిని మొదలు పెట్టింది. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు ఉంటుంది. ఒక్కో గడ్డర్‌ తయారీకి 25క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగించారు. స్పిల్‌వేపై గడ్డెర్లను ఒక క్రమ పద్ధతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు.గడ్డర్లు, కాంక్రీట్ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. వానాకాలంలో గోదావరికి వరద ఎక్కువగా వస్తుంది. దీంతో ఈసారి వరద పొంగినా పనులు ఆగకుండా పనులు చేపట్టారు.

పోలవరం పనులు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఏపీ ప్రజల సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారంగా పనులను వాయువేగంతో చేస్తున్నారు. జూన్‌ చివరి నాటికి స్పిల్‌ ఛానల్‌ లో 1.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేశారు. స్పిల్‌వేలో 1.38 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌లో 1,10,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 2.83 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టితీసే పని 10.35లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 99వేల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10.84లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేశారు.. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో పనులు సాగుతున్నాయి.

వానాకాలంలోనూ పనులు ఆగకుండా పోలవరంలో నడిచేలా ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ పనులు పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఏపీ ప్రజలకు తాగు, సాగునీటి అందించేలా పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతోంది.