Begin typing your search above and press return to search.

ఫాం హౌస్ లో మాస్కులు అక్కర్లేదా సారూ?

By:  Tupaki Desk   |   7 Jun 2020 3:48 PM GMT
ఫాం హౌస్ లో మాస్కులు అక్కర్లేదా సారూ?
X
రోటీన్ రోజులు వేరు. అందుకు భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. పాలకుల తీరు ఎలా ఉండాలి? అనునిత్యం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవటం.. దానికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకుంటున్నారు? అన్నది చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇందుకు భిన్నం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి అర్థంకాని పరిస్థితి. లాక్ డౌన్ వేళలోనూ.. తనకెంతో ఇష్టమైన ఎర్రవల్లి ఫాం హౌస్ లోనే కేసీఆర్ ఎక్కువ సమయాన్ని గడిపినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

ఇంతకీ ఫాంహౌస్ లో ఏం చేస్తుంటారు? అన్న సందేహాం చాలామందికి వస్తుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన పలువురితో ఆయన సుదీర్ఘ భేటీలు నిర్వహించటం.. పుస్తకాలుచదవటంతో పాటు.. ముఖ్యమైన ఫైళ్లను చూస్తారని చెబుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఠంఛన్ గా సీఎంవోకు వెళ్లాలి? సమావేశాల్లో పాల్గొనాలనే తీరుకు కేసీఆర్ వ్యతిరేకమన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సీఎంవో అంటూ ఇప్పటికే క్లియర్ కట్ స్టేట్ మెంట్ ఇచ్చేశారెప్పుడో.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంవోకు రెగ్యులర్ గా రావాలా? వద్దా? అన్న డిబేట్ లోకి వెళ్లకుండా.. తాజాగా ఫాంహౌస్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చెబుతున్నట్లుగా.. రోటీన్ కు భిన్నంగా.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటికి పంటలు వేయాలన్న తన వాదనను ఇప్పటికే అమలు చేస్తున్న కొందరు రైతుల్నిసీఎం ప్రత్యేకంగా కలుస్తున్నారు. తాజాగా అలా ఒక భేటీ జరిగింది. ఫాంహౌస్ బయట తనను కలిసిన రైతులు.. వ్యవసాయ అధికారులతో ముచ్చటించారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎవరి ముఖానికి మాస్కులు లేకపోవటమే కాదు.. భౌతిక దూరాన్ని పాటించకుండా ఉండటం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కులు ధరించటం తప్పనిసరైన వేళలో.. తనను కలిసే వారు మాస్కు ధరించేలా చూడటమేకాదు.. తనకు తాను మాస్క్ ధరించటంఅవసరం. అందుకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటం గమనార్హం.