Begin typing your search above and press return to search.

తమ్ముళ్లూ.. బాబును క్వారంటైన్ పంపుతారా? ఏంటీ?

By:  Tupaki Desk   |   25 May 2020 3:30 PM GMT
తమ్ముళ్లూ.. బాబును క్వారంటైన్ పంపుతారా? ఏంటీ?
X
తెలుగు దేశం పార్టీ శ్రేణులు.. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును నిజంగానే డేంజర్ లో పడేస్తున్నారనే చెప్పాలి. ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం ఒక్కటే గత్యంతరం అయిన వేళ.. రెండు నెలలకు పైగా హైదరాబాద్ కే పరిమితైపోయిన చంద్రబాబు... ఎట్టకేలకు సోమవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా తమ నేతకు స్వాగతం చెబుతామంటూ రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు.. భౌతిక దూరం మాట కాదు కదా.. అసలు లాక్ డౌన్ నిబంధనలను అసలు పాటించలేదు. బాబును కారును చుట్టుముట్టేశారు. బాబు కూడా ఒరగా కారు డోర్ తెరిచేసి చేతులూపుతూ సాగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.

అసలే చంద్రబాబు కరోనాపై చేస్తున్న కామెంట్లపై వైసీపీ సర్కారు కాస్తంత గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా రాగానే హైదరాబాద్ పారిపోయారంటూ వైసీపీ నేతలు ఒకింత గట్టిగానే బాబును టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీకి వచ్చేందుకు చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నా.. ఆచితూచి అనుమతులు ఇచ్చిన వైసీపీ సర్కారు.. ఏమాత్రం తేడా వచ్చినా బుక్ చేసేందుకు కాసుక్కూర్చున్నదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించకుండా చంద్రబాబు సాగితే.. ఆయనను నేరుగా క్వారంటైన్ కు పంపేందుకు కూడా వెనుకాడేది లేదన్నట్లుగా వైసీపీ సర్కారు వ్యూహం రచించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే.. కరోనా మహమ్మారి 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు - పదేళ్ల లోపు పిల్లలకు ఇట్టే అటాక్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల వయస్సున్న చంద్రబాబు.. భౌతిక దూరం అన్న మాట లేకుండా సాగితే... ఆయనకూ కరోనా సోకే ప్రమాదం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు మార్గంలో ఆయనకు స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటకు రావడం - బాబును చుట్టుముట్టేయం - భౌతిక దూరం అస్సలు పాటించకుండా వ్యవహరించడం చూస్తుంటే... స్వయంగా తెలుగు తమ్ముళ్లే బాబును డేంజర్ లో పడేస్తారా? ఏంటీ? అన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.