Begin typing your search above and press return to search.

వైసీపీకి మేలు చేస్తున్న బాబు నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   11 Dec 2017 7:49 AM GMT
వైసీపీకి మేలు చేస్తున్న బాబు నిర్ణ‌యం
X
అదేంటి? ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యం ఆయ‌న రాజ‌కీయ బ‌ద్ద శ‌త్రువు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా మేలు చేస్తుంది? అస‌లు అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా అని ఆశ్చ‌ర్య‌పోకండి. నిజంగా అదే జ‌రుగుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో భాగంగా సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం వైసీపీకి లాభం చేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏమంటే....మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే అయితే ఈ ఎపిసోడ్‌ తో బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

తన బద్ధ శత్రువును అధినేత చంద్రబాబు పార్టీలోకి అహ్వానించడం - తనకు కనీస సమాచారం కూడా లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వైకాపా అధినేతలు జీవీని తమ పార్టీ వైపు నడిపించే యోచనలో పడ్డారు. ఇందులో భాగంగా పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి - రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి శనివారం రాత్రి జీవి శ్రీనాధ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే పెద్దిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాధరెడ్డికి మధ్య తీవ్ర విభేదాలున్నాయి! కొన్ని దశాబ్దాలుగా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్నాయి. అదే స్థాయిలో పెద్దిరెడ్డికి నల్లారి కుటుంబంతో విబేధాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ కిషోర్ టీడీపీలో చేరడం - జీవీ అసంతృప్తితో ఉండటంతో పెద్దిరెడ్డి జీవీని తనవైపు నడుపుకోవడానికి నిర్ణయించుకున్నారు. వారి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి శనివారం పెద్దిరెడ్డి - జీవి ఇంటికి వెళ్లడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సుమారు అరగంట పాటు వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఇటు జీవి అనుచరులు - అటు వైకాపా నాయకులు - కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జీవి ఇంటికి చేరుకున్నారు. వైకాపాలో చేరితే తగిన న్యాయం చేస్తామని వైకాపా ఎమ్మెల్యేలు జీవీకి సూత్రప్రాయంగా హామీలిచ్చినట్లు సమాచారం. ఇదిలావుండగా పీలేరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెలుసుకున్న టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. తక్షణం టీడీపీ జిల్లా అధ్యక్షడు పులివర్తి నానీని సంప్రదించి జీవీని బుజ్జగించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో నాని హుటాహుటిన నాని పీలేరులోని జీవి ఇంటికి చేరుకున్న ఆయన్ను బుజ్జగించారు. జీవీ కూడా అధినేత చంద్రబాబు చేసిన తప్పిదాలను నానీతో వివరించినట్లు సమాచారం. టీడీపీతోనే ఉన్న తనను అవమానించడం ఎంత వరకు ధర్మమని జీవీ ప్రశ్నించగా, అవసరమైతే పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా జీవీని మాట్లాడించేందుకు జిల్లా టీడీపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా జీవీని ఫ్యాన్ గాలికింద నిలబెట్టాలని వైకాపా నేతలు - సైకిల్ దిగకుండా చూడాలని టీడీపీ నేతలు ఎత్తులు - పై ఎత్తులు వేస్తుండటంతో పీలేరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తన బద్ద శత్రువును తన పక్కన నిలబెట్టిన బాబు తీరును వ్యతిరేకించి, మరో బద్ద శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటికి వచ్చి ఆహ్వానించినందుకు వైకాపాలో చేరుతారా అన్నది నేడు పీలేరు వ్యాప్తంగానే కాకుండా చిత్తూరులోనూ నెల‌కొన‌న చ‌ర్చ‌. అదే స‌మ‌యంలో బాబు తీసుకున్న నిర్ణ‌యం వైసీపీకి మేలు చేస్తుందా అనే కోణంలోనూ చ‌ర్చించుకుంటున్నారు.