Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ.. ఏపీ బస్సుల్ని ఆపటం ఉత్త పుకారే

By:  Tupaki Desk   |   8 April 2019 6:27 AM GMT
ఎన్నికల వేళ.. ఏపీ బస్సుల్ని ఆపటం ఉత్త పుకారే
X
దూరంగా ఉంటే అభిమానం పెరుగుతుంది. మమకారం ఎక్కువ అవుతుంది. ఏపీకి దూరంగా హైదరాబాద్ లో ఉన్న లక్షలాది మందికి పుట్టిన గడ్డ మీద మమకారం తన్నుకు వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రీతిలో.. అధికారిక విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక (2014లో జరిగిన ఎన్నిక ఉమ్మడి రాష్ట్రం కిందకే వస్తుంది. ఎందుకంటే.. జూన్ 2న అధికారికంగా ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిందన్నది మర్చిపోకూడదు)ల్లో ఓటు వేసేందుకు సీమాంధ్రులు తమ సొంత ప్రాంతానికి పయనమవుతున్నారు.

తామున్న హైదరాబాద్ తో పాటు.. ఏపీలోనూ ఓటు ఉన్న ఓటర్లు భారీ ఎత్తునే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న మరికొందరు మాత్రం.. ఎప్పటికైనా పుట్టిన గడ్డకు వెళ్లాల్సిందే కదా అన్న ఉద్దేశంతో అక్కడే ఓటు ఉంచుకుంటున్న పరిస్థితి. ఈసారి ఎన్నికలు కీలకంగా మారటం.. ప్రతి ఓటు విలువైనదేనన్న భావన అంతకంతకూ పెరిగిపోవటంతో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులు ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి పోటెత్తనున్నారు.

ఒక అంచనా ప్రకారం సుమారు పాతిక లక్షల మంది ఏపీకి ఓటు వేసేందుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇంత భారీగా ఉండకున్నా 10 లక్షలకు తగ్గదన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే హైదరాబాద్ నుంచి రోజు వెళ్లే.. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు బస్సులకు అదనంగా 2వేల బస్సులకు పైనే ఏపీకి వెళతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల వారు ప్రత్యేక బస్సుల్ని హైదరాబాద్ నుంచి నడుపుతుండగా.. అత్యధికులు మాత్రం ఎవరికి వారు తమ సొంత డబ్బులతోనే ఏపీలో ఓటేసేందుకు వెళుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ఓటు వేయటానికి నాలుగైదు వేలు ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అందుకు భిన్నంగా పైసా తీసుకోం.. మా ఓటును మేం వేస్తాం.. ఏపీలో అధికారంలో ఎవరుండాలో మేం డిసైడ్ చేస్తామన్నట్లుగా హైదరాబాద్ నుంచి ఉద్యమ స్ఫూర్తితో వెళుతున్న సీమాంధ్రుల సంఖ్య భారీగా ఉంది. విడి రోజుల్లో నాలుగైదు వందలు మాత్రమే ఉండే బస్సు టికెట్.. ఎన్నికల పుణ్యమా అని రెట్టింపు కావటమే కాదు.. ఇప్పుడు మూడింతల రేటుకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు రోజుకు ఇది మరింత పెరగటం ఖాయమంటున్నారు.

ఇక.. రైళ్లల్లో రిజర్వేషన్ల బుకింగ్ ఎప్పుడో పూర్తి కావటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో ఓటు వేసేందుకు వెళుతున్న ఏపీ బస్సుల్ని అడ్డుకుంటారని.. చివరిక్షణంలో క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఒకటే ప్రచారం నడుస్తోంది. అయితే.. ఈ ప్రచారం చేస్తున్నది టీడీపీ వర్గాలేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఓటర్లలో ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులే అన్నది సదరు వాట్సాప్ ప్రచారం చేసే వారి వాదన.

వాస్తవం ఏమంటే.. టీడీపీ.. జగన్ పార్టీకి చెందిన మద్దతుదారులు.. సానుభూతిపరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళుతున్నారన్నది వాస్తవం. ఒక పార్టీకి చెందిన వారే అన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. ఈ ప్రచారాన్ని తెలంగాణ ఆర్టీసీ వర్గాలు సైతం ఖండిస్తున్నాయి. ప్రజలు ఎవరికి వారుగా వెళుతున్న వాహనాల్ని తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చెప్పేదేమంటే.. వాట్సాప్ లలోనూ.. సోషల్ మీడియాలో జరుగతున్న ప్రచారంలో నిజం లేదు. ఎవరు ఎవరికి ఓటు వేయాలో వారికి ఓటేయండి. ప్రశాంతంగా జర్నీ చేయండి. అనవసరమైన అనుమానాల్ని మనసులోకి తీసుకురాకండి. ఆల్ ద బెస్ట్.